కొడుకును కాపాడి బలైన తల్లి.. పండక్కి వెళుతూ పోయిన ప్రాణం
ఈ తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్న హరిక్రిష్ణ ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదంలో పదమూడు మంది మరణించిన వైనం తెలిసిందే.;
ఈ తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్న హరిక్రిష్ణ ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదంలో పదమూడు మంది మరణించిన వైనం తెలిసిందే. వేగంగా ఢీ కొన్న టిప్పర్ ధాటికి ప్రైవేటు బస్సు తీవ్రంగా నష్టపోవటమే కాదు.. అప్పటికప్పుడు చెలరేగిన మంటల్లో పదమూడు మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఉదంతానికి సంబంధించి వెలుగు చూస్తున్న ఉదంతాలు అయ్యో అనిపించేలా మారాయి.
ప్రాణాలు కోల్పోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో వేదన. మనసుల్ని కదలించేలా ఉన్న ఈ ఉదంతాల విషయానికి వస్తే.. ఈ ప్రమాదం మరోసారి తల్లిమనసు ఎలా ఉంటుందన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. కళ్ల ముందు ప్రాణాలు పోయే సమయంలోనూ చెట్టంత కొడుకు క్షేమమే ప్రధానంగా భావించిందే తప్పించి.. తాను ఏమవుతానన్న విషయాన్ని పట్టని ఈ అమ్మ ఉదంతం ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఈ ఘోర ప్రమాదంలో కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన 45 ఏళ్ల రమాదేవి తన కొడుకు మనోహర్ తో కలిసి ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్నారు. పండుగ నేపథ్యంలో సొంతూరుకు వెళుతున్నారు ఈ తల్లికొడుకులు. బస్సు ప్రమాదం చోటు చేసుకోవటం.. మంటలు చెలరేగటంతో.. తల్లి మనసు కొడుకు క్షేమాన్ని కాంక్షించింది.
తల్లికొడుకులు ఇద్దరు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురి కావటం.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో.. మంటల తీవ్రతను గుర్తించిన ఆమె.. కొడుకును బస్సులో నుంచి బయటకు తోసిసింది. అదే సమయంలో ఆమె బయటకు రాలేక సజీవ దహనమైంది. ఈ విషాద ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకు కోసం తల్లి చేసిన త్యాగం ఇప్పుడు అందరి కంటతడి పెట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. మరో ఉదంతంలో పండక్కి ఇంటికి వెళుతున్న ఇంటిపెద్ద ప్రాణాలు కోల్పోయిన విషాదం మనసును కలిచివేసేలా మారింది.
కుటుంబ పోషణ కోసం సొంతూరును వదిలేసి తెలంగాణలోని జగిత్యాలకు వచ్చిన వ్యక్తి.. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు సొంతూరుకు బయలుదేరగా.. తాజా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దాసరపల్లికి చెందిన వెంకటేశ్వర్లు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత జగిత్యాల జిల్లాకు బేల్దారి పనుల కోసం వెళ్లగా.. శ్రీరామనవమి నేపథ్యంలో కుటుంబంతో స్వామి వారి కల్యాణంలో పాల్గొనేందుకు వేరే బస్సులో బయలుదేరాడు.
పామూరుకు చేరుకున్న వెంకటేశ్వర్లు.. అక్కడి నుంచి తమ ఊరు (పొదలకూరు) చేరుకునేందుకు కనిగిరి వైపు వెళుతున్న హరిక్రిష్ణ ట్రావెల్ బస్సులో ఎక్కాడు. రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయాడు. అనూహ్య రీతిలో ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయిన పలువురు ఉదంతాలు.. ఆయా కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగించాయి.