టాప్ స్టోరి: చైనాను అనుస‌రించ‌క‌పోతే ప్ర‌పంచ వినాశ‌నం!

అమెరికా వంటి శక్తులపై ఆధారపడకుండా ఉండటంలో చైనా ప్రదర్శిస్తున్న ముందుచూపు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.;

Update: 2026-03-26 17:30 GMT

ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల పర్యవసానంగా, తమకు సంబంధం లేని యుద్ధంలో గల్ఫ్ దేశాలు బలిపశువులవుతున్నాయి. ఇంతకాలం పర్యాటక స్వర్ధామాలుగా విరాజిల్లిన దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పుడు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్ల ధాటికి విలవిలలాడుతున్నాయి. ఈ భయానక వాతావరణం వల్ల అంతర్జాతీయ పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. జియో పాలిటిక్స్ పుణ్యమా అని చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి ప్రపంచం అల్లాడిపోతున్న తరుణంలో గల్ఫ్ దేశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

గల్ఫ్ దేశాలకు పట్టిన ఈ గతికి ప్రధాన కారణం అమెరికా వంటి అగ్రరాజ్యంతో చేసిన `దుష్ట సహవాసం` అని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యాపార, దౌత్య పరంగా అమెరికాతో పెంచుకున్న మితిమీరిన స్నేహం ఇప్పుడు ఆ దేశాలకు శాపంగా మారింది. అమెరికా తన దురహంకారంతో చేసే యుద్ధాల వల్ల పొరుగు దేశాలైన గల్ఫ్ రాజ్యాలు భారీగా నష్టపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాకిస్థాన్ వంటి దేశాలకు కూడా తమ పొరుగు దేశాల నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యాల స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న దేశాలు బలైపోవడం ఒక విషాదకర పరిణామం.

అమెరికా వంటి శక్తులపై ఆధారపడకుండా ఉండటంలో చైనా ప్రదర్శిస్తున్న ముందుచూపు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కమ్యూనిస్టు భావజాలంతో అగ్రరాజ్య పెత్తనాన్ని వ్యతిరేకించే చైనా, తన ఇంధన అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదని దృఢ నిశ్చయంతో ఉంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ లేదా గ్యాస్ సరఫరా ఆగిపోయినా తట్టుకునేలా చైనా తన సొంత విద్యుత్ ఉత్పాదకతను పెంచుకుంది. ఈ వ్యూహాత్మక స్వయంసమృద్ధి చైనాను ప్రపంచంలోనే అత్యంత తెలివైన దేశంగా నిలబెట్టింది. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఉండటమే నిజమైన ఇంధన భద్రత అని చైనా నిరూపిస్తోంది.

చైనా తన ఇంధన భద్రత కోసం సుమారు 4 ట్రిలియన్ యువాన్ల భారీ పెట్టుబడితో స్వీయ శ‌క్తి పున‌రుత్పాద‌క‌త‌పై దృష్టి సారించ‌డం ద్వారా `హోర్ముజ్ జలసంధి`పై ఆధారపడటాన్ని తగ్గించుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బి.ఆర్.ఐ) ద్వారా రష్యా, మధ్య ఆసియా నుంచి భూమార్గంలో పైప్‌లైన్లు నిర్మించడం.. పాకిస్థాన్ (సీపీఈసీ), మయన్మార్ గుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సముద్ర మార్గాల ముప్పును తప్పించుకుంది. అంతేకాకుండా... డాలర్ వ్యవస్థకు చెక్ పెడుతూ `పెట్రో-యువాన్`.. సొంత చెల్లింపు వ్యవస్థ (సీఐపిఎస్‌) ద్వారా ఆర్థిక ఆంక్షల నుండి రక్షణ పొందింది. వాహనాల విద్యుదీకరణను (ఈవీలు) ప్రోత్సహించడం ద్వారా చమురు వినియోగాన్ని గణనీయంగా తగ్గించింది.

ప్రపంచం మొత్తం హోర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ భయంతో వణికిపోతుంటే చైనా మాత్రం నిశ్చింత‌గా ఒక ప్రత్యామ్నాయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. గల్ఫ్ దేశాలు మిగిలిన ప్రపంచ దేశాలు చైనా అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక స్వయంసమృద్ధిని, ఇంధన వైవిధ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దుష్టుడు(అమెరికా)తో స్నేహం చేసిన 150 కోట్ల జ‌నాభా ఉన్న‌ భార‌త‌దేశం క‌చ్ఛితంగా చైనాను అనుక‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. లేనిపక్షంలో అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఇంధన సరఫరా నిలిచిపోయి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి భవిష్యత్తు అంధకారమవ్వడం ఖాయం. చైనా బాటలో నడవకపోతే ప్రపంచానికి వినాశనం తప్పదని ఈ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.

Tags:    

Similar News