జగన్ రాకపోతే.. ఆగిపోతుందా: అయ్యన్న
''ఏం.. జగన్ రాకపోతే.. ఆగిపోతుందని అనుకుంటున్నారా?'' అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
''ఏం.. జగన్ రాకపోతే.. ఆగిపోతుందని అనుకుంటున్నారా?'' అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. రాజధాని అమరా వతికి సంబంధించిన చట్ట బద్ధత కోసం ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం.. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేలా.. చర్చించి, తీర్మానాన్ని రూపొందించి.. కేంద్రానికి పంపించనుంది. తద్వారా ప్రధాన ఘట్టం పూర్తవుతుంది.
ఈ క్రమంలోనే శనివారం ప్రత్యేకంగా అసెంబ్లీని హాజరుపరచనున్నారు. దీనిపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. సభ ఒక్కరోజు మాత్రమే జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే సభ తీర్మానం పూర్తయ్యే వరకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? చట్టబద్ధత వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనే అంశాలపై సభ్యులు చర్చించనున్నారని తెలిపారు.
ఈ సభలకు కూడా వైసీపీకి ఆహ్వానం ఉంటుందన్నారు. తమ పనిని తాము చట్టం పరిధిలో నిబంధనల మేరకు చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. సభకు రావడం, రాకపోవడం అనేది వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తన సూచన అయితే.. సభకు వచ్చి అమరావతిపై జరిగే చర్చలో పాల్గొంటే బాగుటుందన్నారు. బాధ్యతాయుత మాజీ ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆయన సభకు రావడం లేదని.. ఇప్పుడు కీలక చర్చ నేపథ్యంలో ఆయన సభకు రావాలని సూచించారు.
అయితే.. జగన్ వచ్చినా రాకపోయినా.. ఏదీ ఆగదని అయ్యన్న చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారని తెలిపారు. జగన్ కోసం ఇప్పటి వరకు ఏదైనా ఆగిందా? అని మీడియాను ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ మంకు పట్టు పనికిరాదన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది తాను కూడా ఇచ్చేది కాదన్నారు. ఇది ప్రజలు ఇవ్వాలని వైసీపీకి సూచించారు.