నన్నెవరు గెలిపిస్తారు: భువనేశ్వరి.. నోట పొలిటికల్ మాట..!
ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపుతో పాటు అవార్డులు కూడా సొంతం చేసుకున్న నారా భువనేశ్వరి.. రాజకీయాల్లోకి వస్తున్నారా? ఆమె మనసులోనూ ఆ కోరిక బలంగా ఉందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
సీఎం చంద్రబాబు సతీమణి.. ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపుతో పాటు అవార్డులు కూడా సొంతం చేసుకున్న నారా భువనేశ్వరి.. రాజకీయాల్లోకి వస్తున్నారా? ఆమె మనసులోనూ ఆ కోరిక బలంగా ఉందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆమె తరచుగా పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా కూడా కుప్పంలో పర్యటించారు.
గతానికి ఇప్పటికి చాలా వరకు తేడా కనిపిస్తోంది. గతంలో పార్టీలకు సంబంధం ఉన్నా.. లేకపోయినా.. ఆమె వ్యవహారం వేరేగా ఉండేది. కానీ.. తాజా పర్యటనలో రాజకీయ గుభాళింపు కనిపించింది. చాలా మంది నాయకులను ఆమె కలుసుకున్నారు. అంతేకాదు.. ప్రజలను కూడా రాజకీయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు.. భువనేశ్వరిని రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
ఈ విషయాన్ని ఆమె కొట్టిపారేయకుండా.. నన్ను ఎవరు గెలిపిస్తారు? అని వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ తనకు ఉంటుందా? తనను ఎవరు గెలిపిస్తారు? అనే వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కుప్పంలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దీంతో భువనేశ్వరి మనసులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందన్న చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సీట్లు పెరుగుతున్నాయి.
అంతేకాదు.. మహిళా రిజర్వేషన్ కూడా అమలు అవుతోంది. ఈ కారణాల క్రమంలో భువనేశ్వరి కనుక పోటీకి సై అంటే.. నియోజకవర్గం చూపించడం.. ఆమెను గెలిపించడం పార్టీకి పెద్ద కష్టం కాదు. పైగా.. కుప్పంపైనే ఎక్కువగా పట్టుబిగిస్తున్న క్రమంలో ఆమె కుప్పం నుంచి పోటీ చేస్తే.. కనీ వినీ ఎరుగని విధంగా మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా.. భువనేశ్వరి రాజకీయ వ్యవహారంపై చర్చ సాగుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.