ఏపీలో గ్యాస్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లే టార్గెట్!
వంట గ్యాస్ (ఎల్పీజీ)కి ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది.;
ఇరాన్ యుద్ధం వేళ వంట గ్యాస్ కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ (ఎల్పీజీ)కి ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఎల్పీజీ కోసం దిగుమతులపై ఆధారపడటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా గ్యాస్ కొరతపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరిగిపోతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని చెబుతూనే, నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కలెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
పీఎన్జీ కనెక్షన్లపై శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లోనే లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ వినియోగ దారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జీ) వైపు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
పిఎన్‌జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, విజయవాడ కనకదుర్గ దేవస్థానం, శ్రీ కాళహస్తి, అన్నవరం, సింహాచలం వంటి దేవాలయాల వంట శాలలకు పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. పీఎన్జీ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న అపార్ట్ మెంట్లు,హోటళ్లు తదితర కమర్షియల్ యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు 24 గంటల్లో మంజూరు చేస్తామని చెప్పారు.
అవసరమైతే ఆటోమేటిక్ అనుమతి వ్యవస్థను అమలు చేస్తామని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం జీఎస్టీ 5 శాతం నుంచి 25 శాతానికి పెంచడం వల్లే పీఎన్జీ వినియోగంపై వినియోగదారులు వెనక్కితగ్గారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీపం పథకం కింద నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ అందిస్తుండగా, పిఎన్‌జీ వినియోగదారులకు నిబంధనల మేరకు రెండు నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వదంతులను నమ్మోద్దని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 2 లక్షల 70 వేల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయని చెప్పారు. గ్యాస్ కొరత అంటూ సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కావడంతో వినియోగదారులు అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్ లు బుక్ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, సాధారణంగా రోజుకు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, ఒక్కో రోజు 3.30లక్షల సిలిండర్లు కూడా డెలివరీ చేశామని వివరించారు.