పెడ‌న‌... టీడీపీ చేజారిపోతోందే!

Update: 2018-06-24 07:57 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల త‌ర్వాత కృష్ణా జిల్లా అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. కృష్ణా జిల్లా ఓట‌ర్ల‌కు ఇత‌ర జిల్లాల ఓట‌ర్లతో పోలిస్తే... కాస్తంత అవ‌గాహ‌న‌తో పాటు రాజ‌కీయ చైత‌న్యం కూడా మెండుగానే ఉంద‌న్న వాద‌న ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న సంగ‌తే. ఈ క్ర‌మంలోనే తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని కృష్ణా జిల్లా ముఖ్య న‌గ‌రం విజ‌య‌వాడ‌కు అతి స‌మీపంలో ఏర్పాటు కానుండటం - మ‌రోవైపు ఇప్ప‌టికే విజ‌య‌వాడ న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌కీయ కేంద్ర బిందువుగా మారిపోయిన నేప‌థ్యం వెర‌సి కృష్ణా జిల్లాకు ఇప్పుడు ఎన‌లేని ప్రాధాన్యం వ‌చ్చి చేరింది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటిన ఈ జిల్లాలో ఇప్పుడు టీడీపీ హ‌వా న‌డుస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్ల‌ను సాధించిన టీడీపీ... జిల్లాపై త‌న‌దైన ప‌ట్టు బిగించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌న్నాహాలు చేస్తూనే ఉంది. అయితే ఆ య‌త్నాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు రివ‌ర్స్ య‌త్నాలు కూడా పెద్ద ఎత్తునే జ‌రుగుతున్నాయి.

ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా  సంక‌ల్ప యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో విజ‌య‌వాడ ముఖ‌ద్వారంగా ఉన్న క‌న‌కదుర్గ‌మ్మ వార‌ధిపై క‌నిపించిన జ‌న‌హోరును చూసి టీడీపీ నేత‌ల గుండెలు గుభేలుమ‌న్నాయి. జ‌గ‌న్ వెంట న‌డిచిన జ‌న‌హోరుతో వార‌ధి మొత్తం ఊగిపోయింద‌ని సాక్షాత్తు టీడీపీ అనుకూల మీడియానే ప్ర‌త్యేకంగా వార్త‌లు రాసేసిన విష‌యం మ‌రిచిపోలేనిదే. మొత్తంగా చూస్తే... ప్ర‌స్తుతానికి కృష్ణా జిల్లాపై టీడీపీ ప‌ట్టు కొన‌సాగుతున్నా... మున్ముందు పరిస్థితులు తారుమార‌య్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగానే మొన్నామ‌ధ్య టీడీపీ నేత‌ - మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ర‌విని పార్టీలోనే నిలుపుకునేందుకు చంద్ర‌బాబు ఎంత‌మేర య‌త్నించినా కూడా ఫ‌లితం లేకుండా పోయింది.  వ‌చ్చే ఎన్నికల్లో టికెట్‌ తో పాటు త‌ప్ప‌నిస‌రిగా ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పినా కూడా చంద్ర‌బాబు మాట‌ను ర‌వి ఎంత‌మాత్రం ప‌ట్టించుకోలేదు.

ర‌వి కొట్టిన దెబ్బ‌తో బేజారెత్తిన టీడీపీ అధిష్ఠానం... పార్టీని వీడే అవ‌కాశాలున్న నేత‌ల‌పై దృష్టి సారించాల‌ని జిల్లా శాఖ‌కు ఆదేశాలు జారీ  చేసింది. అయినా కూడా జిల్లాలోని చాలా చోట్ల తెలుగు త‌మ్ముళ్ల ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో టీడీపీకి మంచి బ‌ల‌మున్న స్థానంగా ప‌రిగ‌ణిస్తున్న పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలను బహిష్కరించాలని టీడీపీ పెడ‌న ప‌ట్ట‌ణ శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నిన్న జ‌రిగిన  పట్టణ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెలుగు త‌మ్ముళ్లు ఈ నిర్ణయానికి వచ్చారు. బాబుకు బీపీ పెంచేలా చోటుచేసుకున్న ఈ ప‌రిణామానికి కార‌ణ‌మేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... పెడన పట్టణ అధ్యక్షుడు - మునిసిపల్ మాజీ చైర్మన్  బొడ్డు వేణుగోపాలరావుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలం నుంచే వినిపిస్తోంది.

ఈ మేర‌కు స‌ద‌రు విష‌యాన్ని పార్టీ అధిష్ఠానం వ‌ద్ద తెలుగు త‌మ్ముళ్లు చాలా సార్లు విన్న‌వించారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆ విజ్ఞ‌ప్తుల‌ను బుట్ట‌దాఖ‌లు చేసేసింది. ఇప్ప‌టికే టీడీపీ అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు దాటిపోయింది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు రానున్నాయి. క‌నీసం ఈ ఏడాదిలోనైనా త‌న‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌న్న సూచ‌న‌లు క‌నిపించ‌ని నేప‌థ్యంలోనే వేణుగోపాల‌రావు అండ్ కో ఈ సంచల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ వ్య‌వ‌హారం ఒక్క పెడ‌న‌కు సంబంధించిన‌దే అయినా... జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ద్వితీయ శ్రేణి నేత‌లు వేణుగోపాల‌రావు మాదిరే  తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నాలుగైదు నెల‌ల్లో కృష్ణా జిల్లా టీడీపీలో అసంతృప్త జ్వాల‌లు పెల్లుబికే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News