ముద్రగడను తమ్ముళ్లు రౌండప్ చేస్తున్నారే

Update: 2016-05-29 10:36 GMT
ఏపీ సర్కారుకు కంటి నిండా కనుకు లేకుండా చేసి.. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి చేసిన కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెర మీదకు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏపీ అధికారపక్ష నేతలు ఫుల్ అలెర్ట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత.. హామీల్ని నెరవేర్చని పక్షంలో ఆందోళన చేస్తామంటూ ముద్రగడ పద్మనాభం ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే.

 ఏపీ సర్కారుకు అల్టిమేటం ఇస్తూ.. కాపు హక్కుల సాధన కోసం మరో ఉద్యమాన్ని లేవనెత్తేందుకు వీలుగా పలువురు నేతల్ని కూడగట్టుకునే దిశగా ముద్రగడ వేస్తున్న అడుగుల్ని తెలుగు తమ్ముళ్లు నిశితంగా దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ముద్రగడ పలువురు నేతలతో భేటీ అవుతుంటే.. మరోవైపు ఏపీ మంత్రి.. కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ మీద విమర్శలకు దిగటం గమనార్హం.

రాజకీయ మైలేజీ కోసమే ముద్రగడ ప్రయత్నిస్తున్నారే తప్పించి.. మరేమీ లేదంటూ మండిపడ్డారు. కాపు ప్రయోజనాల కోసం పని చేస్తున్నది ముద్రగడ ఒక్కరే కాదన్న గంటా.. తుని ఘటనకు బాధ్యత వహిస్తారా? లేక బాధ్యులెవరో చెప్పగలరా అంటూ సూటిగా ప్రశ్నించటం గమనార్హం. రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకే ముద్రగడ ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శించిన గంటా.. 20 ప్రశ్నలను సంధించారు. తాను వేసిన ప్రశ్నలకు ముద్రగడ సమాధానం చెబుతారా? అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా గళం విప్పారు. కాపులను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ నేతలతో ముద్రగడ పద్మనాభానికి పనేంటంటూ నిలదీసిన ఆయన.. కాపులను పట్టించుకోని పవన్ కల్యాణ్ తో మంతనాలు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నా.. పోరాటాలు చేయాల్సిన అవసరం ఏమిటన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు ముద్రగడపై విమర్శలు సంధించిన వారిలో ఏపీ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు ఉన్నారు. ముద్రగడ కారణంగా ఏపీలో కాపులు అయోమయంలో పడ్డారని.. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడకు లేదన్న ఆయన.. జగన్ కు కోవర్ట్ గా మారటం మంచిది కాదంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. చూస్తుంటే.. ముద్రగడ ప్రతిమాటకు కౌంటర్ ఇచ్చేలా తెలుగు తమ్ముళ్లు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముద్రగడపై తమ్ముళ్ల మాటల దాడి చూస్తే.. ఆయన్ను ఫుల్ గా రౌండప్ చేసినట్లుగా ఉందనే చెప్పాలి.
Tags:    

Similar News