చినబాబు నోట మాటల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందిగా?

Update: 2023-05-28 09:57 GMT
రాజమహేంద్రవరంలో సందడిగా మొదలైన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఒక మార్పు ఈసారి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి మించి నారా లోకేశ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పాదయాత్ర ఆయనలో తీసుకొచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా పలువురు టీడీపీ నేతల మాటల్లో వినిపించటం గమనార్హం. ఆ విషయం మీడియా ప్రతినిధులకు సైతం అర్థమైన పరిస్థితి. పాదయాత్రతో లోకేశ్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పటానికి.. మీడియాతో మాట్లాడే వేళలో ఆయన చెప్పిన మాటలే నిదర్శనమని చెబుతున్నారు.

సాధారణంగా టికెట్లు ఎంపిక.. అర్హతకు సంబంధించిన మాటల్ని మహానాడు లాంటి వేదికల వద్ద పార్టీ అధినేత హోదాలో ఉన్న వారు స్పందిస్తుంటారు. అందుకు భిన్నంగా లోకేశ్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. 'మా నాన్న ఇది. మా తాత అది లాంటి కబుర్లు చెబితే సరిపోదు. పని చేయకుండా.. తిరగకుండా ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదు. నాతో సహా ఎవరికీ టికెట్ రాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీ అధినేత దశల వారీగా స్పష్టత ఇస్తారు. టికెట్ వచ్చిందని ఇంట్లో కూర్చుంటే కుదరదు. బి ఫారం వచ్చే వరకు ఎవరికీ గ్యారెంటీ లేదు' అని వ్యాఖ్యానించటం గమనార్హం.

గతంలో పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాయకులు కొందరు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వస్తున్న వార్తల్ని లోకేశ్ ను ప్రశ్నిస్తే.. స్వార్థంతో పార్టీని వీడిన కొందరు వస్తామని చెప్పినా తమకు అవసరం లేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఎక్కడైనా నాయకత్వం బలహీనంగా ఉన్నా.. అక్కడ పార్టీలోనే కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. తాను నెరవేర్చగలిగే హామీల్ని మాత్రమే ఇస్తున్నట్లుగా లోకేశ్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం రూ.4వేల కోట్ల తక్కువ ఆదాయం ఉంటే.. ఇప్పుడు ఆ వ్యత్యాసం రూ.40వేల కోట్లుగా చెప్పిన లోకేశ్.. ప్రభుత్వ అసమర్థతకు ఇదో నిదర్శనమని చెప్పారు.

పార్టీ తరఫున కార్యక్రమాల్ని చేపడతామని ఆహ్వానిస్తే నియోజకవర్గ ఇన్ ఛార్జికి చెప్పి చేయాలని చెబుతున్న విషయాన్ని లోకేశ్ స్పష్టం చేశారు ఇది తమ సామ్రాజ్యమని.. పని చేయమని.. తన అడ్డాలోకి ఎవరూ రాకూడదన్న ధోరణి సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కొందరికి.. 2029లో మరికొందరికి అవకాశం రావొచ్చని.. పని చేయని వారికి ఎప్పటికి అవకాశం రాకపోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు లోకేశ్. మహానాడులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Similar News