పాత టీడీపీ ఇన్‌ చార్జిలు జగన్‌ కు టచ్‌ లో ఉన్నారా?

Update: 2016-04-16 05:15 GMT
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మీద ఆకర్ష మంత్రం ప్రయోగించడం ద్వారా వారిని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నాం అని.. అంతటితో తెలుగుదేశం ఏపీలో తిరుగులేని స్థాయికి బలపడిపోతుందని వారు అనుకోవచ్చు గాక.. కానీ వాస్తవంలో.. ఇదంతా కుండమార్పిడి తరహాలోనే జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. వైకాపానుంచి తెదేపాలోకి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు వెళ్తోంటే.. తెదేపానుంచి వైకాపాలోకి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలుగా ఉన్న వారు వచ్చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలుగా ఉంటూ.. గతంలో పోటీచేసి బోలెడు డబ్బు ఖర్చుచేసి ఓడిపోయి ఉన్నవారు, ఈసారైనా గెలిచే ఆశలతో గడుపుతూ ఉండగా.. వారికి వైకాపా ఎమ్మెల్యేలు రావడం సహజంగా షాకింగే. అందుకే తెదేపా ఇన్ చార్జిలుగా ఉన్న చాలా మంది జగన్‌ తో టచ్‌ లోకి వెళ్తున్నారని.. సీటు గ్యారంటీ ఇచ్చేట్లయితే ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ పార్టీలోకి వచ్చేస్తాం అని చెబుతున్నారని... విశ్వసనీయంగా తెలుస్తున్నది.

రాజకీయంగా నాయకుల చేరికలు , ఫిరాయింపులు అంటేనే కప్పల తక్కెడ లాంటి వ్యవహారం. త్రాసు లో తూకం ఎప్పటికీ నిలకడగా ఉండదు. అటూ ఇటూ మొగ్గుతూనే ఉంటుంది. తెలుగుదేశం గెలిచిన వారిని లాగేసుకుంటూ ఉంటే.. వైకాపా గత ఎన్నికల్లో ఓడి ఇన్ చార్జిలుగా ఉన్న వారిని అటునుంచి ఇటు లాగేసుకుని.. మన పార్టీ బలాన్ని వారికి జతచేసి.. ఈసారి గెలిపించుకుందాం అనే ఆలోచనతో పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది.

రాజకీయంగా వ్యూహరచనలో ఒకే నాయకుడి గుత్తాధిపత్యం కలకాలం ఉంటుందని అనుకోవడం భ్రమ. ఇవతలి వారికి ఎన్ని వ్యూహాలు ఉంటాయో, అవతలి వారికి కూడా అన్నే వ్యూహాలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే.. అధికారంలో ఉండడం వలన కొన్ని ఎడ్వాంటేజీలు, ప్రతిపక్షంలో ఉండడం వలన కొంతకాలం నిరీక్షించవలసిన అవసరమూ ఉంటుంది. అందుకే తెదేపా ఇన్ చార్జిలు తనతో టచ్‌ లోకి వస్తున్నప్పటికీ కూడా.. జగన్‌ వేచిచూసే ధోరణిలో స్పందిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
Tags:    

Similar News