కంబోడియాలో ‘కేజీఎఫ్’ మార్క్ వెట్టిచాకిరి.. సైబర్ బానిసలుగా భారతీయులు!!

కంబోడియా, థాయ్ లాండ్ దేశాల మధ్య సరిహద్దు సమస్య వేల మంది సైబర్ బానిసలకు విముక్తి కలిగించింది.;

Update: 2026-02-09 18:30 GMT

కంబోడియా, థాయ్ లాండ్ దేశాల మధ్య సరిహద్దు సమస్య వేల మంది సైబర్ బానిసలకు విముక్తి కలిగించింది. ఉద్యోగాల పేరుతో మోసపోయి సైబర్ ముఠాల వద్ద బందీలుగా ముగ్గిపోతున్న వందల మందిని తాజాగా థాయ్ సైన్యం విడిపించింది. ఇందులో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బాధితులను థాయ్ ఆర్మీ సురక్షిత స్థావరాలకు తరలించి, వారి పాస్ పోర్టుల ఆధారంగా స్వదేశాలకు పంపుతోంది. అచ్చం కేజీఎఫ్ సినిమాను తలపించే రీతిలో సైబర్ ముఠాలు అమాయకులైన యువతీ, యువకులను బందీలుగా చేసుకుని వారితో బలవంతంగా వ్యవస్థీకృత నేరాలు చేయిస్తున్నారని థాయ్ ఆర్మీ ప్రకటించింది.

కేజీఎఫ్ సినిమాలో బంగారు గనుల్లో పని చేయించేందుకు వందల మందిని బానిసలుగా మార్చుకుని, ప్రైవేటు సైన్యం నియంత్రణలో వెట్టిచాకిరి చేయించడాన్ని అందరూ చూసే ఉంటారు. దీనికి అచ్చు గుద్దినట్లు కంబోడియాలో సైబర్ ముఠాలు ప్రైవేటు సైన్యం పెట్టుకుని ఉద్యోగాల పేరుతో యువతకు గాలం వేసి వారిని బంధీలుగా చేస్తున్నాయని బయటపడింది. వేర్వేరు దేశాలకు చెందిన వందల మందిని ఒక చోట బంధించి, వాళ్లతో డిజిటల్ అరెస్టులు వంటి రకరకాల సైబర్ నేరాలను బలవంతంగా చేయిస్తూ కోట్లు కొల్లగొట్టినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేస్తోంది.

కంబోడియాతో సరిహద్దు వివాదం కారణంగా ఇటీవల థాయ్ సైన్యం ఆకస్మిక దాడులు చేసింది. కంబోడియా సరిహద్దుల్లో ఓస్మాచ్ అనే పట్టణంపై థాయ్ ఆర్మీ చేసిన దాడిలో సైబర్ ముఠా గుట్టు రట్టు అయింది. గత డిసెంబరులోనే వైమానిక, ఉపరితల దాడులను థాయ్ సైన్యం ప్రారంభించింది. ఈ దాడుల్లో వరుసగా కంబోడియా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను విడిపించుకుంటూ వస్తోంది. ఈ ప్రాంతాలకు తాజాగా అంతర్జాతీయ మీడియాను తీసుకువెళ్లి సైబర్ ముఠాను పట్టుకున్న ఓ భవనాన్ని చూపించింది.

ఓస్మాచ్ పట్టణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలో వందల మంది యువతీయువకులు పెద్ద ఎత్తున సైబర్ క్రైం కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు థాయ్ ఆర్మీ వెల్లడించింది. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో ఉద్యోగాల పేరిట వేర్వేరు దేశాల నుంచి రప్పించిన యువతను ఓస్మాచ్ పట్టణంలో పలు భవనాల్లో బంధించినట్లు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారి పాస్ పోర్టులు తీసుకుని, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్లతో సైబర్ నేరాలు చేయించినట్లు గుర్తించారు.

థాయ్ ఆర్మీ జరిపిన దాడిలో ఓ భవనంలో వందల మంది సైబర్ బానిసలను గుర్తించగా, అందులో భారతీయులు, తెలుగు వారు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ బంధీలు అంతా రకరకాల మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతూ అమయాకులను దోచుకున్నారని అంటున్నారు. చూడటానికి ఐటీ కంపెనీలో కనిపించే ఆయా భవనాల్లో సైబర్ నేరాలు చేసేందుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని భవనాలలో పోలీసుస్టేషన్, బ్యాంకుల సెట్టింగులు వేసినట్లు థాయ్ సైన్యం వెల్లడించింది.

మనదేశంతోపాటు చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల పోలీసుస్టేషన్లను తలపించేలా ప్రత్యేకంగా సెట్టింగులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా పోలీసు డ్రెస్సులు, ఆయా దేశాల జాతీయ జెండాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో కంప్యూటర్లు, రకరకాల పత్రాలు, హార్డ్ డిస్క్, సిమ్ కార్డులను సీజ్ చేశారు. సైబర్ నేరాలు ఎలా చేయాలన్నదానిపై పక్కా ప్రణాళికలు రచించిన ముఠాలు వివిధ భాషలతో పత్రాలు రాసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News