కేంద్రం నిధులు దండీగా... చేయొద్దు దండుగ
కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వచ్చే దాన్ని వదులుకోకుండా తీసుకుని వస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.;
కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వచ్చే దాన్ని వదులుకోకుండా తీసుకుని వస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాల కోసం ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది అని ఆయన చెప్పారు. అలా వచ్చిన వాటిని నూరు శాతం ఖర్చు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. సమర్ధంగా వీటిని వినియోగించాలని అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాలని ఆయన సూచించారు. ఒక వేళ కేంద్ర నిధులు కనుక సక్రమంగా ఖర్చు కాకుండా మురిగిపోతే మాత్రం అధికారులని పూర్తిగా బాధ్యులను చేస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
పెద్ద ఎత్తున నిధులు :
ఇదిలా ఉంటే 2026-27 ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కేంద్ర నిధులు ఏపీకి వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి ఏకంగా 26 వేల 21 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో కేంద్రం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
ఏపీకి ఆదాయ మార్గాలు :
ఏపీకి ఎన్నో విధాలుగా ఆదాయ మార్గాలు ఉన్నాయని వాటిని కలుపుకుని నిధులను పెంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఏపీలో పన్నుల ద్వారా ఆదాయం ఏ ఏటికి ఆ ఏడు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏ మాత్రం పన్నుల వసూళ్లు తగ్గకూడదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో వ్యాపారులను ఎక్కడా వేధించకూడదని చెప్పారు. అలాగని రాష్ట్ర ఖజానాకు నష్టం రాకూడదని ఆయన కోరారు. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ విభాగంలో 2025-26 ఆర్ధిక సంవస్తరం 9 వేల 103 కోట్ల రూపాయలతో 27 శాతం మేర వృద్ధి నమోదైందని చంద్రబాబు గుర్తు చేశారు.
ఫోకస్ పెట్టాల్సిందే :
ఇక ఎక్సైజ్ వాణిజ్య పన్నులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు, పురపాలక శాఖ ఇలా అన్ని విభాగాలు సమర్థంగా పని చేయాలని బాబు కోరడం విశేషం. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్ర చందనం విక్రయించి ఆదాయం ఆర్జించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఎర్ర చందనం విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసామని బాబు చెప్పరు. అదే సమయంలో ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని అన్నారు. అలాగే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలని బాబు సూచించారు. ఏపీకి సంబంధించి ఒక లక్షా నాలుగు వేల 727 పీడీ ఖాతాలలో ఉన్న అన్ క్లైమ్డ్ డిపాజిట్ల విలువ 148 కోట్ల రూపాయలుగా ఉందని చెప్పారు. ఇలా ఉన్న వాటిని నేరుగా ఆయా జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవచ్చునని చెప్పరు.
విద్యుత్ భారం ఉండదు :
ఇక ఏపీ ప్రజలకు ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.