'నో ఫోన్ ఛాలెంజ్'... మన పక్కనే సక్సెస్, ఇక మీదే ఆలస్యం!
ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే.. అది కాస్తా టీనేజ్ కి వచ్చేసరికి వ్యసనంగా మారిపోతున్న పరిస్థితి.;
ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే.. అది కాస్తా టీనేజ్ కి వచ్చేసరికి వ్యసనంగా మారిపోతున్న పరిస్థితి. స్కూలు నుంచి ఇంటికి రాగానే స్నేక్స్ తింటున్నప్పటి నుంచి ఫోన్ పట్టుకుని.. నిద్రపోయే వరకూ దానితోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కేరళలోని ఓ టీచర్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది!
అవును... మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తన విద్యార్థులను ఫోన్ నుంచి దూరం చేయాలని కేరళలోని ఓ ఉపాధ్యాయురాలు బలంగా ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా కన్నూరులోని జీ.హెచ్.ఎస్.ఎస్. కుతుంపరంబలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమృత అనే టీచర్ "నో ఫోన్ ఛాలెంజ్" విసిరారు. ఈ సమయంలో పిల్లల మనసు ఫోన్ వైపు వెళ్లకుండా తనదైన శైలిలో మాయాజాలం చేశారు. ఇది సక్సెస్ అయ్యిందని విద్యార్థుల తల్లితండ్రులు ఒప్పుకుంటున్నారు!
వాస్తవానికి అమృత టీచర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని నిమిషాల్లోనే పరధ్యానంలో ఉన్నట్లు ఆమె గమనించారట. అందుకు.. స్కూల్ అయిపోయిన తర్వాత వారు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లో రీల్స్, షార్ట్స్ చూస్తూ, మొబైల్ గేమ్స్ ఆడటమే కారణమని తెలుసుకున్నారంట. దీంతో.. అధిక మొబైల్ ఫోన్ వినియోగం వారి ఏకాగ్రతను తగ్గిస్తుందని గ్రహించిన టీచర్... వెంటనే "నో ఫోన్ ఛాలెంజ్" విసిరారు.
ఈ సమయంలో తన విద్యార్థులను ఫోన్ ల నుంచి దూరం చేయడానికి ఆమె స్టిక్కర్లు, ఆటలు, ప్రకృతితో మమేకం వంటి వాటిని నమ్ముకున్నారని అంటున్నారు! ఆరేళ్ల పిల్లలు అంత తేలికగా అలవాటును మానుకోవడం కష్టమని భావించినా... వారికి మొదటి రోజు స్టిక్కర్లు అందజేశారు.. తర్వాత కథల పుస్తకాలు ప్రవేశపెట్టారు.. ఇదే సమయంలో బంకమట్టితో బొమ్మలు చేయడం.. నోట్ బుక్ లను వారికి బహుమతులుగా ఇవ్వడం ప్రారంభించారు! ఏదోలా వారికి మొబైల్ స్క్రీన్ పై మోజును తగ్గించారు!
ఈ సందర్భంగా స్పందించిన ఓ విద్యార్థి తల్లి... గతంలో తాము ఎక్కడికి ప్రయాణించినా ఆ ప్రయాణ సమయమంతా తమ కుమారుడు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాడని.. అయితే ఇప్పుడు మాత్రం కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నాడని, పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో.. తమ కుమారుడు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ కోసం చిన్న సైజు యుద్ధమే చేసేవాడని.. ఇప్పుడు మాత్రం డ్రాయింగ్ వేస్తున్నాడని అంటున్నారు.
సో... మనసుంటే మార్గం ఉంటుదన్నది తాజాగా "నో ఫోన్ ఛాలెంజ్" విషయంలోనూ సక్సెస్ అయ్యింది.. అది కూడా ఆరేళ్ల పిల్లల విషయంలో. ఇది తాజాగా కేరళలోని ఓ పాఠశాలలో వీజయవంతం అయ్యింది కాబట్టి.. ఇకపై మీ స్కూలు విద్యార్థుల వంతు, ఇంట్లో మీ పిల్లల వంతు!!