స్పీకర్ ఓం బిర్లా దిగిపోవాల్సిందే...ఏం జరగనుంది?

లోక్ సభలో అధికార విపక్షాల మధ్య గట్టిగా పట్టు బిగుస్తోంది. దాంతో బడ్జెట్ సెషన్ అంతా పూర్తిగా వాయిదాలతో కొట్టుకుని పోతోంది.;

Update: 2026-02-09 17:29 GMT

లోక్ సభలో అధికార విపక్షాల మధ్య గట్టిగా పట్టు బిగుస్తోంది. దాంతో బడ్జెట్ సెషన్ అంతా పూర్తిగా వాయిదాలతో కొట్టుకుని పోతోంది. మరో వైపు చూస్తే లోక్ సభ స్పీకర్ మీద విపక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎంతసేపూ ట్రజరీ బెంచీల వైపునే చూస్తున్నారు అని విమర్శిస్తున్నారు. తమకు మైక్ ఇవ్వడం లేదని రూల్స్ అన్నీ తమకే అన్నట్లుగా పరిస్థితి ఉందని ఫైర్ అవుతున్నారు.

రాహుల్ సీరియస్ :

లోక్ సభలో సోమవారం వాయిదా తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్ర నేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ జరుగుతున్న తీరు మీద తన ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీ సభ్యులకే అవకాశాలు దక్కుతున్నాయని అలాగే వారు పుస్తకాలు చూపిస్తూ మాట్లాడుతున్నారని తమకు మాత్రమే రూల్స్ చెబుతున్నారని అన్నారు. తాము మాట్లాడాలని చూస్తే సస్పెండ్ చేస్తున్నారు అన్నారు. బడ్జెట్ సెషన్ కి ప్రధాని రాకపోవడం మీద ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో చర్చించాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయని బీజేపీ మాత్రం వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తోంది అని ఆయన ఆరోపించారు. ప్రియాంకా గాంధీ సైతం స్పీకర్ వైఖరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతకాల సేకరణ :

ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాసం పెట్టేందుకు విపక్ష శిబిరం సిద్ధపడుతోంది. ఈ మేరకు సంతకాల సేకరణ సాగుతోంది. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ డీఎంకే, ఎస్పీ సహా కీలక పార్టీల ఎంపీలు అందరూ కూడా స్పీకర్ మీద అవిశ్వాసం నోటీసు మీద సంతకాలు చేశారు. దాంతో మంగళవారం దీని మీద సభలో ఏమి జరగబోతోంది అన్న చర్చ సాగుతోంది. విపక్ష శిబిరం అయితే స్పీకర్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు అని ఘాటుగా విమర్శిస్తోంది.

నిబంధనలు ఏమి చెబుతున్నాయి :

సభలో చూస్తే మెజారిటీ ఎంపీలు అధికార ఎన్డీయేకే ఉన్నారు. అయినా సరే తమ నిరసన తెలియచేయడానికి విపక్షం స్పీకర్ మీద అవిశ్వాసం మార్గం ఎంచుకుంది అని అంటున్నారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కేవలం లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. అయితే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలీ అంటే కనీసం 50 మంది లోక్‌సభ సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత దానిని స్పీకర్ పరిశీలించి అనుమతి ఇవ్వవచ్చు. సభలోని కార్యకలాపాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, దానిపై చర్చ కోసం ఒక రోజు లేదా కొన్ని రోజులు లేదా ఒక రోజులో కొంత భాగాన్ని కేటాయించవచ్చు. ఇదీ లోక్ సభ ప్రొసీజర్స్ చెబుతున్న విషయం.

గెలుపు ఎన్డీయేదే అయినా :

లోక్ సభలో చూస్తే ఎన్డీయే కూటమికి 294 దాకా ఎంపీలు ఉన్నారు. తటస్థ ఎంపీల మద్దతుతో కలిపితే ఈ నంబర్ 300కి చేరుకుంటుంది. అదే సమయంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి 98 దాకా ఎంపీలు ఉన్నారు. ఎస్పీకి 37 ఉన్నాయి. డీఎంకే తృణమూల్ పార్టీలు అన్నీ కలుపుకుంటే 200 దాకా ఉండొచ్చు. అయితే స్పీకర్ మీద అవిశ్వాసం నెగ్గేంత బలం మాత్రం ఉండదు, కానీ ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా లోక్ సభలో విపక్షం గొంతుని స్పీకర్ ద్వారా ప్రభుత్వం నొక్కుతోంది అన్న సందేశాన్ని దేశం మొత్తానికి చెప్పాలన్నది ఇండియా కూటమి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. సో మంగళవారం ఏమి జరగబోతోంది అన్నది అయితే చాలా ఆసక్తిగా ఉంది.

Tags:    

Similar News