చంద్ర‌బాబు పార్టీ డ‌బ్బులు బాగానే వెన‌కేసింది.. తెలుగు రాష్ట్రాల్లోనే టాప్‌!

Update: 2021-03-20 05:30 GMT
జీవితంలో ప్రతి ఒక్క‌రూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాల‌ని చెబుతుంటారు పెద్ద‌లు. ఇది.. రాజకీయ పార్టీల‌కు కూడా వ‌ర్తిస్తుంది కాబోలు! అందుకే.. కోట్లాది రూపాయ‌లు వెన‌కేస్తున్నాయి పార్టీలు. అయితే.. ఏ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విష‌యం మాత్రం జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌దు. అందుకే.. క్లారిటీ ఇచ్చింది ది అసోసియేష‌న్ ఆఫ్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్‌(ఏడీఆర్‌). తాజాగా ఓ లిస్టు విడుద‌ల చేసిందీ సంస్థ‌. ఇందులో ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఈ జాబితా ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా డ‌బ్బులున్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం మొద‌టి స్థానంలో నిలిచింది! దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది! ఏడీఆర్ నివేదిక ప్ర‌కారం..టీడీపీకి రూ.193 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ రూ.188 కోట్ల‌తో ఆరో స్థానంలో ఉంది. రూ.93 కోట్ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ 8వ స్థానంలో నిలిచింది.

అత్యంత ధ‌నిక ప్రాంతీయ పార్టీగా స‌మాజ్ వాదీ పార్టీ నిలిచింది. ఆ పార్టీకి రూ.572 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రెండో స్థానంలో న‌వీన్ ప‌ట్నాక్ బీజేడీ ఉంది. ఈ పార్టీకి 232 కోట్ల సంప‌ద ఉంది. త‌మిళ‌నాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ రూ.206 కోట్ల‌తో మూడో ప్లేసులో ఉంది.

ఇక‌.. జాతీయ పార్టీల ఆస్తుల వివ‌రాలు చూస్తే భారీగా ఉన్నాయి. బీజేపీకి దేశంలోనే అత్య‌ధికంగా 2,904.18 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. కాంగ్రెస్ కు రూ.928.24కోట్ల ఆస్తులు మాత్ర‌మే ఉన్నాయి. పార్టీలు త‌మ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం విరాళాలు సేక‌రించే విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News