పదకొండేళ్ల బుడతుడికి ఒబామా సీటు కావాలంట

Update: 2015-05-24 11:18 GMT
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా ఉంటుంది భారత సంతతికి చెందిన తనిష్క్‌ అబ్రహం వ్యవహారం చూస్తే. కేవలం పదకొండేళ్ల వయసులోనే మూడు డిగ్రీలు చదివేసిన ఇతగాడి వ్యవహారం మొదటి నుంచి కాస్త ఆసక్తికరమే. ఎంత ఇంట్రరెస్టింగ్‌గా లేకపోతే.. ఇతగాడికి అమెరికా అధ్యక్షుడు ఒబామా లేఖ రాస్తారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఉండే ఈ బుడతడు.. లాస్‌ఏంజెల్స్‌లోని అమెరికన్‌ రివర్‌ కాలేజీ నుంచి డిగ్రీలు పొందాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అంశాల్లో. గణితం.. సైన్స్‌.. ఫారిన్‌ లాంగ్వేజస్‌ మీద ఇతగాడు ఏడేళ్ల వయసు నుంచే ఇంటి వద్ద చదువుకుంటున్నాడు.

చదువులో అద్భుతాలు సాధిస్తున్న ఈ కుర్రాడు.. మాటల్లో మాత్రం నిలకడ కనిపించదు. ఎందుకంటే ఒకసారి డాక్టర్‌ కావాలని.. మరోసారి మెడికల్‌ రీసెర్చర్‌ కావాలని చెప్పుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు మాత్రం అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటమే తన లక్ష్యంగా చెబుతున్నాడు. చిన్నపిల్లాడు కావటంతో ఇలాంటి మాటలు చెప్పటంలో తప్పేం కాదు. అందుకే.. ఇతగాడి ఘనకీర్తిని తల్లిదండ్రులే కాదు.. మీడియా కూడా తెగ మెచ్చేసుకుంటుంది.
Tags:    

Similar News