తాలిబన్ల సహకారం ఉంది ..కానీ , వారి నుండే ప్రమాదం : జో బైడెన్ !

Update: 2021-08-25 09:31 GMT
ఆఫ్ఘనిస్తాన్‌ లో అరాచకం సృష్టిస్తున్న తాలిబాన్లకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయా, అంటే అంతర్జాతీయ మీడియా వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఆఫ్ఘన్‌ గడ్డ నుంచి ఆగస్టు 31లోగా అమెరికా సైనిక బలగాలు వెళ్లిపోవాలని తాలిబాన్లు అల్టి మేటం జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డెడ్‌ లైన్‌ పై అమెరికా నిఘా సంస్థ 'సిఐఎ' అధిపతి విలియం జె.బర్న్స్‌ ఆఫ్ఘన్‌ అనధికారిక పాలకుడు అబ్దుల్‌ ఘనీ బారాదార్‌ మధ్య కాబూల్‌ లో రహస్య సమావేశం జరిగిందని అమెరికా దినపత్రిక 'వాషింగ్టన్‌ పోస్ట్‌' ఒక కథనం వెలువరించింది. అమెరికా పౌరులు, సైనిక బలగాలు వెళ్లేందుకు ఆగస్టు 31 డెడ్‌లైన్‌ విధించిన సమయంలో ఈ రహస్య సమావేశం జరగటంపై ఆసక్తి నెలకొంది. అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన వేలాది మంది పౌరులు ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకు పోయారని, వీరిని తరలించటం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియగా అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నారు.

తొమ్మిది రోజుల క్రితం కాబుల్ తాలిబాన్ చేతిలోకి వెళ్లిపోయిన నాటి నుంచి కనీసం 70,700 మందిని విమానంలో తరలించారు. తాలిబాన్లు మా ప్రజలను తరలించడానికి సహకారం అందిస్తున్నారు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాలిబాన్లు చేసే పనుల ద్వారానే అంతర్జాతీయ సమాజం వారిని గుర్తిస్తుంది అని పేర్కొన్నారు. తాలిబాన్లు తరలింపు గడువును పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుండి పెరుగుతున్న ముప్పు కారణంగానే ఎయిర్‌లిఫ్ట్ త్వరగా ముగించాల్సి వస్తోందని బైడెన్ చెప్పారు. అఫ్గాన్లో అమెరికా బలగాలు ఎక్కువ సమయం ఉంటే, ఇస్లామిక్ గ్రూప్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

జీ7 సమావేశాల్లో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ లతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు అఫ్గాన్ సంక్షోభం గురించి వర్చువల్ సమావేశంలో చర్చించిన తర్వాత బైడెన్ మాట్లాడారు. చర్చలకు అధ్యక్షత వహించిన యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. బ్రిటన్ చివరి క్షణం వరకు ప్రజలను తరలించడం కొనసాగిస్తుందని వెల్లడించారు. గడువు దాటిన తర్వాత కూడా అఫ్గాన్ల తరలింపునకు అనుమతించాలని ఆయన తాలిబాన్లను కూడా కోరారు. కాబుల్ విమానాశ్రయంలో దాదాపు 6,000 మంది అమెరికా సైనికులు, యూకే నుంచి 1,000 మందికి పైగా ఉన్నారు. విదేశీయులు, అర్హతగల అఫ్గాన్లలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, టర్కీతో సహా నాటోకు చెందిన బలగాలు కూడా కాబుల్ విమానాశ్రయంలో ఉన్నాయి. ఆదివారం నుంచి ఎయిర్ లిఫ్ట్ వేగవంతం చేయడంతో 21,000 మందికి పైగా ప్రజలను తరలించారు.

అంతకుముందు మంగళవారం, తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, గడువు పొడిగింపునకు తమ సంస్థ అంగీకరించే అవకాశం లేదన్నారు. అఫ్గాన్లు విమానాశ్రయానికి వెళ్లకుండా ఆపేస్తామని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ లో పనిచేసే మహిళలు, వారి భద్రతకు సంబంధించి సరైన పద్దతులు అమలు చేసే వరకు ఇంట్లోనే ఉండాలని ముజాహిద్ సూచించారు. మా భద్రతా దళాలకు మహిళలతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వలేదు. మహిళలతో ఎలా మాట్లాడాలో కొందరికి తెలియద అని ఆయన అన్నారు. భద్రతలో మేము పూర్తిగా మెరుగు పర్చుకునే వరకు, ఇంట్లోనే ఉండమని మహిళలను కోరుతాము అని తెలిపారు.

తాలిబాన్లు 2001 కి ముందు అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉండగా, ఇస్లామిక్ చట్టాలను అనుసరించి కఠినమైన సంస్కరణలను అమలు చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, తాలిబాన్లు మహిళలపట్ల మరింత సంయమనంతో వ్యవహరిస్తున్నట్టు ఒక కొత్త ఇమేజ్‌ కోసం తాపత్రయపడుతున్నారు. మహిళలు, బాలికలకు కొంత వాక్ స్వాతంత్య్రాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచెలెట్ మాట్లాడుతూ తాలిబాన్ మానవ హక్కుల ఉల్లంఘనలపై తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. వీటిలో ఉరిశిక్షల అమలు, మహిళలపై ఆంక్షలు, బాల-సైనికుల నియామకాలు వంటివి ఉన్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ మంగళవారం మహిళలు, బాలికల హక్కుల సంరక్షణకు తీర్మానాన్ని ఆమోదించింది.
Tags:    

Similar News