ఆధార్ పౌరుడి ఉనికిని చంపేస్తోంది

Update: 2018-01-18 05:21 GMT
ఆధార్.. ఓ భారీ ఎలక్ట్రానిక్ వల అని - అది దేశాన్ని నిఘారాజ్యంగా మార్చేస్తుందని సుప్రీంకోర్టు ఎదుట పిటిషనర్లు ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతహక్కును ఆధార్ కాలరాస్తున్నదంటూ దాఖలైన పలుపిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ తుదిదశకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌ మిశ్రా - జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ - జస్టిస్ ఆదర్శ్ కుమార్ సిక్రి - జస్టిస్ డీవై చంద్రచూడ్ - జస్టిస్ అశోక్‌ భూషణ్‌ లతో కూడిన ధర్మాసనం బుధవారం పిటిషనర్ల - ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్నది. ఆధార్‌ తో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని పిటిషనర్లు వాదించగా ప్రభుత్వం ఆ వాదనల్ని తోసిపుచ్చింది.

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపిస్తూ.. `ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుంది. అది పౌరుడి ఉనికినే హత మార్చగల అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతుంది. ఆధార్‌ తో దేశం నిరంకుశ రాజ్యంగా మారిపోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆధార్‌కు సంబంధించి బయోమెట్రిక్ వివరాల నమోదులో ఎలాంటి ఐచ్ఛికత లేదు. అది వ్యక్తి స్వేచ్ఛను హరించే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వల` అని ఆరోపించారు. ప్రభుత్వాలు హక్కుల్ని కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు న్యాయస్థానాలు పౌరులకు రాజ్యాంగ రక్షణను కల్పించాలని కోరారు. ఆధార్‌ వల్ల ప్రజల ప్రాథమిక హక్కు అయిన 'గోప్యత' ఉల్లంఘనకు గురవుతున్నదని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఆధార్‌ ద్వారా ప్రజల రాజ్యాంగాన్ని ప్రభుత్వ రాజ్యాంగంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని శ్యామ్‌ దివాన్‌ ధర్మాసనానికి విన్నవించారు. దేశ రాజ్యాంగం ప్రకారం 'గోప్యత' పౌరుల ప్రాథమిక హక్కు అని గత ఏడాది ఆగస్టులో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ త్వరలో ఇచ్చే నివేదిక ఆధారంగా ఆధార్ సమాచార భద్రతకు కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురానున్నదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆధార్ డేటాను అనధికారికంగా ఉపయోగించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టాన్ని తయారు చేశామని కేంద్రం పేర్కొంది.
Tags:    

Similar News