సెకెండాఫ్ చూడ‌మంటున్న కేన్ విలియ‌మ్స‌న్

Update: 2021-09-14 11:43 GMT
ఐపీఎల్-2021లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ఫెయిల్యూర్ అలాంటిలాంటిది కాదు.. క‌చ్చితంగా గెలుస్తుంద‌నుకున్న మ్యాచ్ ల‌లో ఓడ‌టం, ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో ఫ‌లితం మారిపోవ‌డం, అభిమానుల‌ను తీవ్రంగా నిరుత్సాహ ప‌ర‌చ‌డం ఎస్ఆర్హెచ్ జ‌ట్టు కు ఈ ఏడాది రొటీన్ గా మారింది. చేజేతులారా మ్యాచ్ ల‌ ను చేజార్చుకుంటూ వ‌చ్చింది. ఫ‌స్ట్ నుంచి స‌రైన ప్ర‌తిభ చూపించ‌క ఓడిపోతే అదో లెక్క‌. అయితే ఎస్ఆర్హెచ్ జ‌ట్టు మాత్రం.. మొద‌ట బ్యాటింగ్ చేసినా, మొద‌ట బౌలింగ్ చేసినా...  ఊరించి, ఊరించి చివ‌ర్లో మ్యాచ్ ను విడిచిపెడుతూ వ‌చ్చింది. ఫ‌లితంగా మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడితే ఆరింట ఓట‌మి!

ఓట‌ముల సంగ‌త‌లా ఉంటే.. ఈ సారి అనూహ్య మార్పులు కూడా చేశారు. తొలి మ్యాచ్ ల‌లో ఓడిపోయిన నేప‌థ్యంలో కెప్టెన్ వార్న‌ర్ ను త‌ప్పించేశారు.  సీజ‌న్ మ‌ధ్య‌లోనే ఇలా కెప్టెన్ ను త‌ప్పించేసి తీవ్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అక్క‌డ‌కూ వార్న‌ర్ ఎస్ఆర్హెచ్ కు మంచి స్థాయిలోనే సేవ‌లందించాడు. 2016లో జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. ఆ త‌ర్వాత కూడా వార్న‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌ట్టు మ‌రీ ఫెయిల్యూర్ కాలేదు. ఐదో స్థానం, నాలుగో స్థానం వంటి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానాలే ద‌క్కాయి. ఈ సారే పూర్తిగా ఫెయిల్. ఆ ఆక్రోశంలో యాజ‌మాన్యం వార్న‌ర్ ను త‌ప్పించేసింది. కేన్ విలియ‌మ్స‌న్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

విలియ‌మ్స‌న్ త‌న వ‌ర‌కూ మంచి ఫామ్ లోనే క‌నిపించాడు తొలి స‌గంలో. ఇక రెండో స‌గంలో మాత్రం జ‌ట్టు కూడా రాణిస్తుంద‌ని ఈ కివీస్ కెప్టెన్ అంటున్నాడు. తొలి స‌గంలో త‌మ జ‌ట్టు ఫెయిల్ అయినా, వాయిదా అనంత‌రం జ‌రిగే మ్యాచ్ ల‌లో త‌మ స‌త్తా చూపుతామంటూ విలియ‌మ్స‌న్ అంటున్నాడు. అయితే పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానాల్లో ఉంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు.

విరామం అనంత‌రం జ‌రుగుతున్న మ్యాచ్ ల‌లో వ‌ర‌స విజ‌యాలు సాధిస్తే త‌ప్ప‌.. ఎలిమినేష‌న్ రౌండ్ కు అర్హ‌త సంపాదించ‌లేక‌పోవ‌చ్చు. మిగిలిన ఏడు మ్యాచ్ ల‌లోనూ ఒక్క‌టి కూడా ఓడ‌కుండా గెల‌వాలి. అప్పుడే అవ‌కాశాలు ఉంటాయి. మ‌రి తొలి ఏడు మ్యాచ్ ల‌లో నిస్పృహ‌తో కూడిన ఓట‌ముల‌ను ఎదుర్కొన్న జ‌ట్టు.. రెండో స‌గంలో అద్భుతాలేమైనా చేస్తుందేమో చూడాలి!
Tags:    

Similar News