గవర్నర్ తో సుజనా ఎందుకు భేటీ?

Update: 2016-08-31 09:33 GMT
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్వరూపం బాగా మారిపోయింది. ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా.. అదో కీలక పరిణామంగా అభివర్ణించే వారు ఎక్కువైపోయారు. అంచనాలు ఊహాగానాలుగా మారి.. పలువురు చెలరేగిపోతున్నారు. తమకు తోచినట్లు రాసేస్తున్నారు. నిన్నటికి నిన్న గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. అడ్వకేట్ జనరల్ లు భేటీ కావటంపై చాలానే విశ్లేషణలు బయటకువచ్చాయి.

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రిపై నమోదైన ప్రైవేటు కేసుకు సంబంధించిన కీలకాంశాల్ని వివరించేందుకే వారి భేటీ జరిగినట్లుగా మీడియాలో పలు వాదనలు వినిపించాయి. ఇందులోనిజం పాళ్ల కంటే ఊహాగానాలే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విచారణకు స్వీకరించి.. దానిపై సమగ్ర దర్యాప్తు నివేదిక ఇవ్వాలన్న ఆదేశంతో చాలానే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదెంత వరకు వెళ్లిందంటే.. ఓటుకు నోటు కేసు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీతో రాయబేరాలు షురూ చేశారంటూ ప్రచారం సాగుతోంది.

నిజానికి ఓటుకు నోటు కేసు విషయంలో బాబు మీద చర్యలే ఉండి ఉంటే గతంలోనే ఉండేవి. అలా కాదని.. ఇప్పుడు చేసిన ప్రైవేటు ఫిర్యాదుతోనే చిక్కులు వచ్చే అవకాశమే ఉండి ఉంటే.. ఏపీ విపక్షం ఇంతకాలం ఎందుకువెయిట్ చేసేదన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి.. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా.. ప్యాకేజీలకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న చర్చకు సంబంధించిన వివరాల్ని ఆయనకు చెప్పేందుకు కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ బయటకు రాలేదు. అయితే.. గవర్నర్ తో కేంద్రమంత్రి సుజనా భేటీ తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపైనే ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News