ఫేస్ బుక్ నిలిచే కొన్ని గంటల ముందు అలా జరిగిందట

Update: 2021-10-06 05:55 GMT
టెక్నికల్ సమస్య ఏదైనా వస్తే దాన్ని పరిష్కరించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. కోట్లాది రూపాయిలు వేతనంగా తీసుకుంటూ.. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు పని చేసే ఫేస్ బుక్ కు సాంకేతిక సమస్య వస్తే.. దాన్ని పరిష్కరించటానికి ఏడు గంటలు పట్టటమా? అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది. ఫేస్ బుక్ లాంటి పెద్ద కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన సేవలకు అంతరాయం కలిగేలా మారటం.. అత్యంత అరుదైనదిగా చెప్పాలి. అయితే.. ఈ సంచలన ఘటన జరగటానికి కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

ఫేస్ బుక్ లో పని చేసి తర్వాత మానేసిన మాజీ ఉద్యోగిని 37 ఏళ్ల ఫ్రాన్సెస్ హోగెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆమెపలు వివరాల్ని బయటపెట్టారు. సిత్రంగా ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ఫేస్ బుక్ సేవలు నిలిచిపోవటం.. వాటిని సరి చేయటానికి ఏడు గంటల సమయం పట్టిన అసాధారణ పరిస్థితి నెలకొనటం జరిగింది. ఇంతకూ ఆమె వెల్లడించిన వివరాలేంటి? అన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ అంశాలు బయటకు వస్తాయి.

ప్రభుత్వానికి.. సెక్యూరిటీ ఎక్స్ చేంజ్ కమిషన్.. వాల్ స్ట్రీట్ జర్నల్ కు చేరిన ఇంటర్నల్ డాక్యుమెంట్లను హాగెన్ బయటపెట్టారు. వాస్తవానికి ఫేస్ బుక్ అల్గారిథమ్ ను మారిస్తే మరింత సురక్షితంగా ఉంటుందని ఆమె చెప్పారు. కానీ.. అలా చేస్తే ఫేస్ బుక్ లో జనాలు ఎక్కువ సేపు ఉండరని.. అదే జరిగితే ప్రకటనలపై తక్కువ క్లిక్ లు వస్తాయని.. అందుకే ఫేస్ బుక్ ఆ పని చేయట్లేదన్నారు.

తాను చాలా సోషల్ మీడియా నెట్ వర్కుల్నిచూశానని.. వాటి ముందు ఫేస్ బుక్ ఎందుకు కొరగాదన్న ఆమె.. ఫేస్ బుక్ రక్షణ చర్యల కంటే కూడా ఆదాయాన్నే కోరుకుంటుందని చెప్పటం గమనార్హం. ఓవైపు ఆమె వెల్లడించిన సంచలన అంశాలతో కూడిన లైవ్ కార్యక్రమం జరిగిన కొద్ది గంటలకే.. ఫేస్ బుక్ దాని అనుబంధ సంస్థలైన వాట్సాప్.. ఇన్ స్టాలు దాదాపు ఏడు గంటల పాటు పని చేయకుండా పోవటం.. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కావటం కలకలాన్ని రేపింది. కన్ఫిగరేషన్ మార్పులు చేయటంలో జరిగిన తప్పులే ఈ పరిస్థితి కారణమని చెబుతున్నా.. అలాంటి మార్పులు చేస్తే.. అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్న హెచ్చరిక వ్యవస్థ ఫేస్ బుక్ లాంటి సంస్థకు ఉండదా? అన్ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే..ఏడు గంటల పాటు ఆగిన ఫేస్ బుక్ విషయంలో ఏదో జరిగిందన్న సందేహాలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.


Tags:    

Similar News