ఏపీ అసెంబ్లీ సమావేశాలు- సర్వత్రా ఉత్కంఠ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.;

Update: 2026-02-10 23:30 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. ఈ సమావేశాల కోసం సర్వం సిద్ధం అయింది. ఈసారి సమావేశాలు దాదాపుగా నెల రోజుల పాటు సాగనున్నాయి. ఇదిలా ఉంటే సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయం మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరీ అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

గవర్నర్ ప్రసంగంతో :

సంప్రదాయాన్ని అనుసరించి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్నాయి.బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈసమావేశాలు ఈసారి సమావేశాలు ఈ నెల 11 నుండి మొదలై మార్చి 12వ తేది వరకు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెల రోజులైనా సమాధానాలు రాకపోవడం చూస్తున్నామని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగకుండా సకాలంలో సమాధానాలు పంపేలా చూడాలని కార్యదర్శులను స్పీకర్ ఆదేశించారు.

కట్టుదిట్టమైన భద్రత:

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డీజీపీని ఆయన కోరారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తు తో పాటు అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని స్పీకర్ ఆదేశించారు.

డిజిటల్ విధానంలో సభ నిర్వహణ :

రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నేషనల్ ఇ-విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని స్పీకర్ చెప్పడం విశేస్ధం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం మొదలు పెడతామని అన్నారు. ఆ విధంగా వచ్చే వర్షాకాల సమావేశాల నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టుగా స్పీకర్ చెప్పారు.

వందల్లో ప్రశ్నలు :

ఇదిలా ఉంటే అసెంబ్లీలో ప్రశ్నల అవర్ జీరో అవర్ లలో సభ్యులు అడిగే ప్రశ్నలను నమోదు చేసుకుని వాటికి సకాలంలో సమాధానాలు పంపేందుకు వీలుగా ప్రతి శాఖ నుండి ఒక నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీకి సంబంధించి 283 ప్రశ్నలకు,శాసన మండలికి సంబంధించి 562 ప్రశ్నలకు ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుండి సమాధానాలు పంపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దాంతో వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు తక్షణ చర్యలు తీసుకుని అసెంబ్లీకి సమాధానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. అలాగే అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలను మానిటర్ చేసేందుకు వీలుగా జిఏడిలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను కూడా సిద్ధం చేశామని ఆ పోర్టల్ ద్వారా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి సకాలంలో సమాధానాలు పంపేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

వారంలోగా జవాబులు :

ఇక నిబంధనల ప్రకారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారం రోజులు లోగా సంబంధిత శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉంది. అయితే సమాధానాలను కొన్ని శాఖలకు చెందిన అధికారులు చాలా ఆలస్యంగా పంపిస్తున్నారని ఇకపై సకాలంలో పంపేందుకు కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు సూచించారు.నేషనల్ ఇ విధాన్ కింద త్వరలో డిజిటల్ విధానంలో సభను నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు.

Tags:    

Similar News