మా అబ్బాయి ప్రమాదం చేశాడని తెలీదు: కస్టడీలో సీదిరి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకుని విచారించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో ఆయనకు 20 నుంచి 30 ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా బాధిత కుటుంబాన్ని ఎందుకు మాయ చేసే ప్రయత్నం చేశారని ఆయనను ప్రశ్నించారు. అలానే బాధిత కుటుంబానికి 9 లక్షల రూపాయలు ఇవ్వజూపిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. అదేవిధంగా తన కుమారుడి స్థానంలో వేరే వ్యక్తి ప్రమాదం చేసినట్టు పోలీసులకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అయితే.. వీటికి సీదిరి ఎక్కడా తడుము కోకుండా సమాధానాలు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
తన కుమారుడు ప్రమాదం చేసినట్టు తనకు అసలు తెలీదని.. తన స్నేహితుడితో కలిసి బుల్లెట్‌పై ప్రయాణించాడని అనుకున్నట్టు సీదిరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావించానని, అందుకే.. తన కుమారుడి పేరును చెప్పలేదని ఆయన వెల్లడించారు. ఈ సమయంలో సీసీటీవీ ఫుటేజీలను చూపించగా.. అవి నకిలీవి ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. తమపై టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కోణంలోనూ కేసును విచారించాలని ఆయన కోరారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి 9 లక్షల రూపాయల ఇవ్వజూపామన్న దానిలో తమ పాత్ర లేదని.. మీడియా సృష్టించిందని సీదిరి తెలిపారు.
నా గురించి మీకు తెలీదా?
ఈ సమయంలో సీదిరి అప్పలరాజు పోలీసులను ఉద్దేశించి.. నా గురించి మీకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. తాను దాదాపు 20 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నానని.. వైద్యుడిగా, రాజకీయ నేతగా కూడా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన చెబుతున్న విషయాలకు.. వాస్తవంగా జరిగిన దానికి సంబంధం లేకపోవడంతో మరో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపి. ఆయనను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏం జరిగింది?
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ.. గత నెలలో బుల్లెట్ నడిపి.. ప్రమాదాని గురయ్యారు. ఓ గొర్రెల కాపరి దానయ్యను బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. దీనిని మసిపూసి మాయ చేసేందుకు.. కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు సీదిరి పన్నాగం పన్నారన్నది పోలీసులు చెబుతున్న మాట. ఈ క్రమంలో ఆరవ్ స్నేహితుడే ప్రమాదం చేశాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత.. వాస్తవాలు తెలుసుకున్న పోలీసులు.. ఆరవ్‌ను అరెస్టు చేశారు. అనంతరం.. మోసం కేసులో సీదిరిని కూడా అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఒక రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది.