వారు జనంతో ఆడుకున్నారు.. సింధు అకాడమీ ప్రారంభోత్సవంలో లోకేష్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన మైదానాలను ఏర్పాటు చేస్తోందన్నారు.
వైసీపీ హయాంలో `ఆడుదాం ఆంధ్ర` పేరుతో ప్రజల సొమ్మును దోచేశారని మంత్రి లోకేష్ అన్నారు. జనంతో ఆడుకున్నారని విమర్శించారు. కానీ, కూటమి ప్రబుత్వం వచ్చిన తర్వాత.. ప్రజలకు క్రీడలపై ఆసక్తి పెంచుతున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఒకవైపు విద్యారంగం.. మరోవైపు క్రీడారంగం రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.
స్టార్ షట్లర్.. పీవీ సింధు విశాఖపట్నంలో నిర్మించనున్న క్రీడా ప్రాంగణానికి బుధవారం మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఇటీవల ఇక్కడ క్రీడా ప్రాంగణం, హాస్టల్ వసతి సహా.. అన్ని రకాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో `పీవీ సింధు అకాడమీ` నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ మంత్రి లోకేష్ చేతుల మీదుగా నిర్వహించారు. తొలుత మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన మైదానాలను ఏర్పాటు చేస్తోందన్నారు. పాఠశాల విద్య నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహి స్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన కిట్లు నాసిరకంగా ఉండడంతోపాటు.. ప్రజల ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం విద్యార్థులకు కిట్లను అందించడంతోపాటు.. ప్రముఖ క్రీడాకారులతో శిక్షణ కూడా ఇప్పించనున్నట్టు చెప్పారు.
ఈ సమయంలో పీవీ సింధుపై ప్రశంసలు గుప్పించారు. ఇటీవల జపాన్ టైటిల్ నెగ్గి దేశంలోనే మేలైన క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. విశాఖలో నిర్మిస్తున్న క్రీడా భవనానికి ప్రభుత్వం ఎంతో సహకరించిందని తెలిపారు. అధికారులు సైతం తమకు ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. దీనిని అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు.