రాజకీయ వ్యాపారాలు ఢమాల్

Update: 2019-06-01 09:20 GMT
వ్యాపారం, రాజకీయం, బంధుత్వం ... ఇవి మూడు ఎంత వేరుగా ఉంటే అంత మంచిది. లేకపోతే ముప్పే. సాధారణంగా దేశ రాజకీయాలు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపడం కామన్. తొలిసారి ఒక రాష్ట్ర రాజకీయాలు కూడా షేర్ల పతనానికి కారణం అయ్యాయి. ఒకరకంగా దీనిని స్వయంకృతాపరాధం అని కూడా అనుకోవచ్చు. పబ్లిక్ గుర్తించేంత తేడాతో మార్కెట్ రేట్లకు మంచి టెండర్లు తీసుకోవడం వల్లనే ప్రభుత్వాల మార్పు కంపెనీలపై ప్రభావం చూపుతోంది. దీనికి కారణాలు ఏవో అందరికీ తెలుసు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, కొత్త పోర్టులు  వంటి అనేక రకాల  పనులకు కాంట్రాక్టర్ల ఎంపికల అర్హతలతో పాటు ''మనోళ్లు'' అని చూసుకోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. అందుకే చంద్రబాబు ఓటమితో తెలుగుదేశం ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో పతనం అయ్యాయి. అయితే, ప్రభుత్వ మార్పు మాత్రమే దీనికి కారణం అని చెప్పలేం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీవ్రమైన లోటులో ఉండటంతో అదనపు ఖర్చులు వదిలించుకుని ప్రధాన పరిపాలనకు, ప్రజా సంక్షేమానికి ఆటంకం రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో దీర్ఘాకలిక పనులు, విలాస నిర్మాణాలు, భారీ ప్రాజెక్టులు తాత్కాలికంగా ఆపేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రాజెక్టులు దక్కించుకున్న అనేక రంగాలకు చెందిన పలు కంపెనీలు నెగెటెవ్ గా ట్రేడ్ అయ్యాయి.

ముఖ్యంగా ఆంధ్రాకు చెందిన ఇన్‌ ఫ్రా షేర్లు శుక్రవారం స్టాక్‌మార్కెట్‌ లో భారీగా నష్టపోయాయి. నాగార్జునా కన్‌ స్ట్రక్షన్‌ షేరు అత్యధికంగా 17 శాతం నష్టపోయింది. అమరారాజా బ్యాటరీస్‌ (ఎంపీ గల్లా జయదేవ్) షేరు కూడా ఒక శాతం మేర నష్టపోయింది. శ్రీకాళహస్తి పైప్స్‌, ఒకటిన్నర శాతం, ఎన్టీరామారావు వియ్యంకుడి కంపెనీ కాకతీయ సిమెంట్స్ 3.69 శాతం నష్టపోయింది. అంజనీ పోర్ట్‌ లాండ్ సిమెంట్‌ 4.64 శాతం నష్టపోగా,  హెరిటేజ్‌ షేరు 2.23 నష్టపోయింది.

మరోవైపు వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడైన అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీ ఇన్‌ ఫ్రా షేరు 5.34 శాతం మేర లాభపడింది. అలాగే సుబ్బిరామిరెడ్డి కంపెనీ గాయత్రి ఇన్‌‌ ఫ్రా కూడా 4.81 శాతం లాభపడింది. ఆంధ్రా మూలాలున్న కంపెనీ షేర్లలో వస్తున్న మార్పులు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, ఫండ్ మేనేజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇదేమీ గాలి వార్త కాదు... సెలబ్రిటి ఫండ్‌ మేనేజర్‌ పొరింజు వెలియాత్‌ రీజినల్‌ పార్టీల రిస్క్‌ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ముఖ్యంగా రాంకీ షేరు పెరుగుదల, ఎన్‌ సీసీ పతనం నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో వచ్చే ఆర్డర్‌ బుక్‌ లపై కంపెనీలు ఆందోళనలో ఉన్నాయి.

ఆంధ్రా కార్పోరేట్‌ ప్రపంచం రెండు సామాజిక వర్గాల చేతిలో ఉంది. అధికార మార్పిడితో ఒక సామాజిక వర్గం షేర్లు డీలా పడగా, మరో సామాజిక వర్గం షేర్లు ఊపందుకున్నాయి. ప్రజలకు ఏ కంపెనీలు ఎవరివి, వాటి మూలాలు వంటి సమాచారం కూలంకుషంగా తెలియడం కూడా ఈ మార్పుకు కారణమే.

    
    
    

Tags:    

Similar News