ట్రంప్ నిర్ణ‌యంపై స‌త్యనాదెళ్ల స్పంద‌న ఇదే

Update: 2018-06-20 14:41 GMT
అక్రమంగా మెక్సికో బోర్డర్ నుంచి దేశంలో చొరబడుతున్న వలసవాదుల్ని అమెరికా ప్రభుత్వం అరెస్టు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వారి వద్ద ఉన్న పిల్లల్ని ప్రత్యేక డిటెన్షన్ సెంటర్‌ లో నిర్బంధిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా వైఖరిపై నిరసన వ్యక్తం అవుతోంది. ఇలా శరణార్థుల పిల్లలను తల్లిదండ్రులను నుంచి వేరు చేస్తున్న అమెరికా వైఖరి పట్ల క్యాథలిక్ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సర్కార్ చేపట్టిన జీరో టాలరెన్స్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వాటికన్‌ లో ఈ అంశం గురించి మాట్లాడుతూ తల్లుల నుంచి పిల్లలను విడదీయడం  అనైతికమన్నారు. ఇది క్యాథిలిక్ విలువలకు వ్యతిరేకమన్నారు. జనాకర్షణ కోసం ఇలా చేయడం మంచిది కాదన్నారు. గతంలోనూ ట్రంప్ నిర్ణయాలను పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడాన్ని ఫ్రాన్సిస్ నిలదీశారు.

కాగా, ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా స్పందించారు. తన బ్లాగ్‌ పోస్ట్‌ లో  దీనిని నిరసిస్తూ రాసిన విషయాలను బుధవారం లింక్డిన్‌ లో నాదెళ్ల షేర్ చేశారు. ప్రధానంగా ఐదు అంశాలను ఆయన లేవనెత్తారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త విధానం చాలా క్రూరమైనది అని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మైక్రోసాఫ్ట్ విధానాన్ని సంస్థ ఎండీ బ్రాడ్ వివరించారని, ఆ వివరాలే ఇవి అని సత్య నాదెళ్ల ఆ బ్లాగ్‌ లో రాశారు. ``అసలు అమెరికా వలసదారుల దేశం. మన ఆర్థిక వ్యవస్థ - సంస్థల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్లను మనం ఆకర్షిస్తున్నాం. ప్రపంచానికి ఓ వెలుగు రేఖలా మనం నిలుస్తున్నాం. కానీ ఇలా వలసదారుల కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేయడం మాత్రం దారుణం. ఓ వలసదారుడిగా, ఓ తండ్రిగా ఇది నన్ను తీవ్రంగా కలచివేస్తోంది` అని సత్య నాదెళ్ల అన్నారు. నిజానికి తన విజయానికి కూడా అమెరికా వలస విధానమే కారణమని నాదెళ్ల చెప్పారు. ``నేను ఉన్న చోటికి అమెరికా టెక్నాలజీ వచ్చి నన్ను కలలు కనేలా చేసింది. ఆ కలను నెరవేర్చుకోవడానికి అమెరికా వలస విధానం ఉపయోగపడింది`` అని ఆయన తెలిపారు.

`ఇక ఇలా వలసదారుల నుంచి ఇలా పిల్లల్ని వేరు చేసే ఎలాంటి ప్రాజెక్టుల్లోనూ మైక్రోసాఫ్ట్ పాలుపంచుకోవడం లేదు``అని ఈ సందర్భంగా నాదెళ్ల స్పష్టంచేశారు. అసలు వలస విధానమే అమెరికా బలమని ఆయన అన్నారు. వలసదారులే అమెరికాను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టారు. ప్రతి వ్యక్తి మానవ హక్కులు, పరువును నిలబెట్టే వలస విధానాలకు మైక్రోసాఫ్ట్ మద్దతు తెలుపుతుంది. మా సంస్థలో పనిచేసే ప్రతి వలసదారుడికి అండగా ఉంటామని సత్య నాదెళ్ల అన్నారు.
Tags:    

Similar News