పవన్ కు మంటపుట్టే మాట అనేసిన కమలనాథుడు!

Update: 2023-03-22 10:07 GMT
స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? అతడి హితం కోరాలి. ఒకవేళ నిజంగానే తప్పులు చేస్తే గుండెల్లో పెట్టుకోవాలే తప్పించి.. నలుగురు ముందు ఇబ్బంది పడేలా ప్రశ్నలు సంధించకూడదు. స్నేహతుడు అనేటోడు ఎవరికైనా తెలిసిన ఈ విషయాలు బీజేపీ నేతలకు ఎందుకు తెలీటం లేదు? తమ రాజకీయ మిత్రుడిగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నేసి మాటలు ఎలా అంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. జనసేనతో పొత్తు అంశంపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

ఇప్పటికే రోడ్డు మ్యాప్ కోసం తాను ఎదురుచూస్తున్న విషయాన్ని.. ఏపీలో బీజేపీ నేతలు కలిసి రాకపోవటాన్ని.. అధికారపక్షంపై మరింతగా పోరాటాలు చేయటానికి ఉత్సాహం చూపని ఏపీ బీజేపీ నేతల తీరుపై పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ఒకింత ఇబ్బంది పడుతూ చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే. గుండెల్లో బాధను.. వేదనను పంచుకునేలా మాట్లాడారే కానీ మిత్రపక్షం మర్యాదను దెబ్బ తీసేలా పవన్ వ్యవహరించలేదు.

అందుకు భిన్నంగా మాధవ్ మాత్రం తాజాగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడారన్న విమర్శ వినిపిస్తోంది. ఇంతకూ ఆయనేమంటన్నారంటే.. జనసేనతో తమకు పేరుకే పొత్తు ఉందని.. ప్రజల్లోకి కలిసి వెళ్లేనే తమను మిత్రపక్షాలుగా నమ్ముతారని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని మాత్రమే ఓడించాలని మాత్రమే జనసేన చెప్పిందని.. బీజేపీని గెలిపించాలని ఎక్కడా చెప్పలేదన్నారు.

జనసేన తమకే మద్దతు ఇస్తుందని పీడీఎఫ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న వైనంపై పవన్ కు చెబితే.. ఆయన స్పందించలేదన్నారు. అదే తమను ఎన్నికల్లో దెబ్బ తీసిందన్నారు. నిజంగానే పవన్ మాట చెప్పకపోవటం వల్ల అంత నష్టం జరిగినప్పుడు.. ఆయన మనసును కష్టపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

జనసేనతో బీజేపీకి పేరుకు మాత్రమే పొత్తు ఉందని.. ఈ కారణంగానే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు నష్టం వాటిల్లినట్లుగా పేర్కొన్నారు.

నిజంగానే పవన్ తో పంచాయితీ ఉంటే.. పార్టీ అధినాయకత్వం ద్వారా మాట్లాడాలే తప్పించి.. ఇలా మీడియాకు ఎక్కి మిత్రుడి మనసు గాయపరిచేలా మాట్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ నేత మాధవ్ పుణ్యమా అని.. పవన్ మరింత కరకు నిర్ణయాన్ని తీసుకోవటానికి సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మాధవ్ మాటల నేపథ్యంలో పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News