ఒక్క పాయింట్ చాలట.. చిన్నమ్మకు చెక్ పెట్టటానికి!

Update: 2020-10-01 03:30 GMT
రాజకీయాలు మహా కర్కసంగా ఉంటాయి. అప్పటివరకు వినయ విధేయలతలో వంగి వంగి నమస్కారాలు పెట్టినోళ్లు సైతం.. తమకు ఛాన్సు చిక్కితే చెలరేగిపోయే ఉదంతాల్ని ఇప్పటివరకు చాలానే చూశాం. ఎక్కడి దాకానో ఎందుకు తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకునే పరిణామాలే ఇందుకు నిదర్శనం. అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలు చిన్నమ్మ శశికళ చేతిలో ఉండటం.. అప్పట్లో ఆమె హవా ఎంతలా నడిచిందన్నది తెలిసిందే.

పార్టీలోని గ్రూపుల్ని సర్దిచెప్పి సున్నితంగా వ్యవహరించాల్సింది పోయి.. ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న ఆమె అత్యాశ నాటకీయ పరిణామాలకు తెర తీసింది. అంతే.. అప్పటివరకు చక్రం తిప్పిన ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పాత కేసులో శిక్షను అనుభవించాల్సి రావటం.. దీంతో సమీకరణాలు మారి మొత్తంగా చిన్నమ్మకు వీర విధేయుడిగా ఉన్న ఎడప్పాడి.. తన ప్రత్యర్థి పన్నీరు సెల్వంతో రాజీ కుదుర్చుకోవటం తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరికి చిన్నమ్మ ఉమ్మడి శత్రవు అయ్యారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటం.. ఏడాది మొదట్లోనే శశికళ జైలు నుంచి విడుదల కానుండటం అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్నమ్మ ఒక్కసారి జైలు నుంచి బయటకు వస్తే రాజకీయ సమీకరణాలు మారిపోవటమే కాదు.. తమకుతిప్పలు తప్పవన్న ఆలోచనలో ఎడప్పాడి.. పన్నీరు ఉన్నట్లుగా చెబుతారు. చిన్నమ్మకు వీర విధేయులు ఇప్పటికి చాలామందే ఎడప్పాడి పక్షాన ఉన్నారు. తమకు సరైన పదవులు లభించలేదన్న కసిలో ఉన్న వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా చెబుతారు.

కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళలో చిన్నమ్మ పార్టీలోకి దూకితే పరిణామాలు వేరుగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ అనుమానాస్పద మరణంపై తాము వేసిన జస్టిస్ ఆరుముగసామి కమిటీ నివేదిక మీదన వారిద్దరు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ నివేదికతో చిన్నమ్మ దూకుడుకు కళ్లాలు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. జైలు నుంచి విడుదలయ్యే లోపు.. చిన్నమ్మ తప్పును ఎత్తి చూపేలా ఒక్క పాయింట్ లభించినా చాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఎడప్పాడి.. పన్నీరు కోరుకుంటున్న ఒక్క పాయింట్ లభిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News