వాట్సప్ సేఫ్ కాదా..! ఆ సందేశాలను వారు చదువుతున్నారా..? షాక్ లో ప్రపంచం..

డిజిటల్ యుగంలో మన ప్రైవసీకి రక్షణగా నిలుస్తుందని నమ్మే వాట్సాప్‌పై ఇప్పుడు నమ్మకద్రోహం ఆరోపణలు వెలువడుతున్నాయి.;

Update: 2026-04-10 07:30 GMT

మనం అత్యంత భద్రం అనుకునే వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో అమెరికాలో బయటపడిన ఈ ఉదంతం ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ‘మీ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్.. మీరూ, మీరు పంపిన వారు తప్ప మరెవరూ వీటిని చదవలేరు’ అంటూ మెటా ఇస్తున్న హామీ కేవలం అబద్ధమని, యూజర్లను మోసం చేయడమేనని ఆ పిటిషన్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది.

వాట్సాప్ సందేశాలను చదువుతున్నారు..

డిజిటల్ యుగంలో మన ప్రైవసీకి రక్షణగా నిలుస్తుందని నమ్మే వాట్సాప్‌పై ఇప్పుడు నమ్మకద్రోహం ఆరోపణలు వెలువడుతున్నాయి. మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన యూజర్ల వ్యక్తిగత చాట్‌లను చదవడానికి తన ఉద్యోగులకు, కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలకు రహస్యంగా అనుమతులు ఇచ్చిందని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో క్లాస్-యాక్షన్ పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది యూజర్ల నమ్మకాన్ని మార్క్ జుకర్‌బర్గ్ వమ్ము చేశారని, ఎన్‌క్రిప్షన్ అనేది కేవలం ఒక కంటితుడుపు చర్యేనని పిటిషనర్ వాదిస్తున్నారు.

పిటిషనర్ ఆరోపణలు ఏంటి..?

పిటిషనర్ ఆరోపణల ప్రకారం.. వాట్సాప్ తన అంతర్గత సిస్టమ్స్ ద్వారా యూజర్ల మెసేజ్‌లను ‘నియర్ రియల్ టైమ్’లో (అంటే మెసేజ్ పంపిన వెంటనే) లేదంటే పాత మెసేజ్‌లను చదివేందుకు వీలు కల్పిస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ, మెటా ఉద్యోగులు విభిన్న టెక్నికల్ లూప్‌హోల్స్ ద్వారా చాట్స్‌ను యాక్సెస్ చేస్తున్నారని, వాటిని విశ్లేషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది యూజర్ల ప్రైవసీ హక్కును కాలరాయడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘ఆపరేషన్ సోర్స్డ్ ఎన్‌క్రిప్షన్’

ఈ వివాదం కేవలం కోర్టు పిటిషన్లతోనే ఆగలేదు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ‘ఆపరేషన్ సోర్స్డ్ ఎన్‌క్రిప్షన్’ పేరుతో అమెరికా వాణిజ్య విభాగం ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తును ప్రారంభించింది. వాట్సాప్ మాజీ కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు, మెటా సిబ్బందికి యూజర్ల చాట్స్‌పై ‘అన్‌ఫెటర్డ్’ (అన్లిమిటెడ్) యాక్సెస్ ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఎలాన్ మస్క్, పేటీఎం విజయ్ శేఖర్ స్పందన

ఈ వార్తలపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎక్స్‌ (X) వేదికగా స్పందిస్తూ.. ‘వాట్సాప్ అస్సలు సురక్షితం కాదు’ అని అన్నారు. నెటిజన్లను వాట్సాప్ వదిలి X చాట్ వంటి ప్రత్యామ్నాయాలను వాడాలని సూచించారు. అటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఇలాంటి ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా వాట్సాప్ సెక్యూరిటీని నమ్మేవారు ‘బ్రెయిన్‌ డెడ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మెటా ఏం చెప్తోంది..

ఈ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని, వాట్సాప్ మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ కాలేదని చెప్పడం కేవలం వార్తల్లో నిలవడానికి చేసే ప్రయత్నం అని కొట్టిపారేసింది. సిగ్నల్ ప్రోటోకాల్ ద్వారా పదేళ్లుగా వాట్సాప్ భద్రతను పటిష్టం చేస్తున్నామని, యూజర్ల చాట్స్ చదవడం తమకు టెక్నికల్ గా అసాధ్యమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణలో నిగ్గు తేలే నిజాలను బట్టి వాట్సాప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ అవుతుంది. ప్రైవసీ విషయంలో టెక్ కంపెనీలు ఇచ్చే హామీలను గుడ్డిగా నమ్మకుండా, మన వ్యక్తిగత సమాచారం పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News