కార్పొరేట్ లో జీతం రూ. 40 వేలు.. డ్రైవర్ గా రూ. 76 వేలు ఒక బెంగళూర్ టెక్కీ కథ..!
యువతలో తీవ్రమైన మార్పు మొదలైంది. ఇతరుల కింద బానిసలా పనిచేసి కష్టాలు పడేకంటే బయట సొంతంగా కష్టపడి ఎక్కువ సంపాదించవచ్చని భావిస్తున్నారు.;
యువతలో తీవ్రమైన మార్పు మొదలైంది. ఇతరుల కింద బానిసలా పనిచేసి కష్టాలు పడేకంటే బయట సొంతంగా కష్టపడి ఎక్కువ సంపాదించవచ్చని భావిస్తున్నారు. చాలా మంది నిరుద్యోగులు భద్రత లేని.. నమ్మకం లేని కార్పొరేటర్ ఉద్యోగాలు కాదని సొంతంగా సంపాదించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగం అంటేనే ఒక హోదా, ఫిక్స్‌డ్ సాలరీ అని అందరూ అనుకుంటారు. కానీ బెంగళూరుకు చెందిన దీపేష్ కథ వింటే, మనం సక్సెస్‌ను కొలిచే కొలమానాలు మారుతున్నాయనిపిస్తోంది. నెలకు రూ. 40 వేల జీతం వచ్చే కార్పొరేట్ జాబ్ కంటే, సొంత కారులో డ్రైవర్‌గా నెలకు అంతకు రెట్టింపు సంపాదించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ‘గిగ్ ఎకానమీ’ కాలంలో దీపేష్ సాధించిన ఈ సంపాదన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..
ఊబర్ డ్రైవర్ గా..
కార్పొరేట్ ఆఫీసుల్లో ఏసీ గదులు, వీకెండ్ సెలవులు.. ఇవేవీ దీపేష్‌కు సంతృప్తిని ఇవ్వలేదు. నెలకు రూ. 40 వేల జీతం కోసం వారానికి ఐదు లేదా ఆరు రోజులు వెట్టిచాకిరి చేసే కంటే, తనకంటూ స్వతంత్రం ఉండే పనిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా తన కార్పొరేట్ ఐడీ కార్డును పక్కన పెట్టి, కారు స్టీరింగ్ పట్టారు. ఇప్పుడు ఆయన సంపాదన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెలకు 20 రోజులు మాత్రమే పనిచేస్తూ ఏకంగా ₹76,000 సంపాదిస్తూ, బెంగళూరు ట్రాఫిక్‌లో తనకంటూ కొత్త దారిని నిర్మించుకున్నారు.
ఉద్యోగం వర్సెస్ ఊబర్..
దీపేష్ పాత ఉద్యోగంలో నెలకు 22 రోజులు పనిచేసినా అతనికి వచ్చేది కేవలం రూ. 40 వేలు మాత్రమే. అంటే సగటున రోజుకు సుమారు రూ. 1,800 వచ్చేది. కానీ ఇప్పుడు ఊబర్ డ్రైవర్‌గా నెలకు కేవలం 20 రోజులు పనిచేస్తూ ₹76,000 ఆర్జిస్తున్నారు. అంటే రోజువారీ సగటు సంపాదన దాదాపు రూ. 3,800. పాత ఉద్యోగంతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. తక్కువ రోజులు పనిచేస్తూ, ఎక్కువ ఆదాయం పొందడం దీపేష్ ను ఆకర్షించింది.
పని ఒత్తిడి నుంచి స్వేచ్ఛ వరకు..
కార్పొరేట్ ఉద్యోగంలో డెడ్ లైన్లు, బాస్ వేధింపులు, టార్గెట్లు సహజం. కానీ ఊబర్ డ్రైవర్‌గా దీపేష్ తనకిష్టమైనప్పుడే లాగిన్ అవుతారు. 20 రోజుల్లో కూడా ఆయనకు నచ్చిన సమయాల్లోనే పని చేస్తారు. మిగిలిన 10 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అయితే, ఈ సంపాదన అంత సులభంగా ఏమీ రాదు. బెంగళూరు ట్రాఫిక్, ఇంధనం ఖర్చులు, వాహన నిర్వహణ వంటివి పోను ఆయన చేతికి ఈ మొత్తం వస్తుండడం గొప్ప విషయమనే చెప్పాలి.
తెలివైన నిర్ణయమా.. తొందరపాటా..?
దీనిని ‘తొందరపాటుగానే పొరపాటు’గానో కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆయన సంపాదన గణంకాలు అలా ఉన్నాయి. కార్పొరేట్ ఉద్యోగంలో ఉండే పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, బోనస్, భవిష్యత్తులో వచ్చే ప్రమోషన్లు డ్రైవింగ్ వృత్తిలో ఉండవు. కానీ ప్రస్తుత ఆర్థిక అవసరాల దృష్ట్యా, చేతికి వచ్చే నగదు ముఖ్యం అనుకునే వారికి దీపేష్ చేసింది కరెక్టు అనిపిస్తుంది. తన నైపుణ్యాన్ని కాకుండా, సమయాన్ని, కష్టాన్ని నమ్ముకుని ఆయన ఈ విజయం సాధించారు.
దీపేష్ కథ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఏ పనీ తక్కువ కాదు.., ఏ వృత్తీ చిన్నది కాదు. మనకు కావాల్సింది సరైన ప్లానింగ్, కష్టపడే తత్వం. కార్పొరేట్ ఉద్యోగాల కంటే ఇలాంటి సొంత వృత్తుల్లోనే ఎక్కువ ఆదాయం ఉండడం ఈ తరం యువతను ఆలోచింపజేస్తోంది. అయితే, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్ గురించి కూడా పూర్తిగా ఆలోచించాలి.