బిహార్ రాజకీయాల్లో కొత్త శకం : సామ్రాట్ చౌదరి చేతికి పగ్గాలు?

బిహార్‌ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు;

Update: 2026-04-10 10:36 GMT

బిహార్‌ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ముఖ్య నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పగ్గాలు చేపట్టనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లో ఎన్డీఏ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ దాదాపు 101 సీట్లు గెలిచినా, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కే అవకాశం ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వెళుతుండటం రాజకీయంగా విస్తృత చర్చ జరుగుతోంది.

ఎవరీ సామ్రాట్ చౌదరి?

బిహార్ రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సామ్రాట్ చౌదరి బిహార్ బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి శకుని చౌదరి మాజీ ఎంపీ, ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కుష్వాహ (కోయిరీ) సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి బీసీ కావడంతో ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిందని అంటున్నారు. బిహార్ ఓటర్లలో యాదవుల తర్వాత అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గం కావడం ఆయనకు కలిసివచ్చిందని చెబుతున్నారు. 1999లోనే అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రికార్డు సృష్టించారు. గతంలో ఆర్జేడీ, జేడీయూలో పనిచేసిన ఈయన, 2017లో బీజేపీలో చేరారు. బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

ముఖ్యమంత్రిగా సామ్రాట్ ఎందుకు?

బీజేపీ అధిష్టానం సామ్రాట్ చౌదరిని ఎంపిక చేయడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ప్రధానంగా సామాజిక సమీకరణలే సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేశాయని విశ్లేషిస్తున్నారు. బిహార్‌లో కుష్వాహ, కుర్మీ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ఆర్జేడీకి సంప్రదాయంగా అండగా నిలుస్తున్న యాదవ సామాజికవర్గ ప్రాబల్యాన్ని తగ్గించాలని బీజేపీ ప్లాన్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రత్యర్థులపై దూకుడు చూపడం కూడా సామ్రాట్ చౌదరికి అడ్వాంటేజ్ అయివుంటుందని అంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి నాయకుడు అవసరమని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు.

బీజేపీ ప్లాన్ ఏంటి?

బిహార్‌లో ఇప్పటివరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆధారపడిన బీజేపీ, ఇప్పుడు "ఓన్ సీఎం" ఫార్ములాను అమలు చేయాలని డిసైడ్ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే సొంత పార్టీ నేతని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కమలనాథులు వ్యూహం రచించారని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను జాతీయ రాజకీయాల్లోకి పంపడం ద్వారా, ఆయనకున్న అనుభవాన్ని కేంద్రంలో ఉపయోగించుకుంటూనే, రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యాన్ని చాటుకోవాలనేది బీజేపీ ఢిల్లీ పెద్దల ప్లాన్ గా భావిస్తున్నారు.

నితీశ్ కుమార్ రాజీనామాకు కారణాలు

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా వెనుక ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ కాలం బిహార్‌ను పాలించిన నితీశ్, ఇప్పుడు రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు వెళ్లి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల ముందు జరిగిన అధికార బదిలీ ఒప్పందం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి పీఠం వదులుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఇందులో ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ రాజీనామా సమర్పించిన అనంతరం గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఈ నెల 14 తర్వాత ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News