చంద్రబాబు 'స్ట్రెయిట్ టాక్': మునుపెన్నడూ లేని విధంగా అటాక్
విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల దాడి పెంచారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లు రాజకీయ ప్రత్యర్థులపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం చర్చనీయాంశం అవుతోంది.;
విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల దాడి పెంచారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లు రాజకీయ ప్రత్యర్థులపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. సుదీర్ఘ ప్రసంగాలతో ఒకప్పుడు అన్నింటికి తానే కారణం అన్నట్లు చంద్రబాబు మాట్లాడేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో స్టైల్ మారినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పంచ్ డైలాగులు, సెటైర్లతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న చంద్రబాబు కొత్త చర్చలకు కేంద్రంగా మారుతున్నారని అంటున్నారు.
అమరావతి ఆగదు
బాపట్ల జిల్లాలో తాజాగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ శ్రేణులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి పాలించే అర్హత ఎక్కడిది? అంటూ మాజీ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ‘‘జగన్ లాంటి వెయ్యి మంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదు.’’ అంటూ తేల్చిచెప్పారు. మొన్నటి వరకూ మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు.’’ అంటున్నారని మండిపడ్డారు.
అసత్య ప్రచారం చేస్తున్నారు
‘‘2019కి ముందు బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై వేశాడు. నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పత్రికలో తప్పుడు కథనం రాశారు. అమరావతిపై కక్ష గట్టి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు అని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు.’’ అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా రైతులను ఇబ్బందులు పెట్టారు. మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ లతో చిత్రీకరించారు. వారిని జట్టు పట్టుకుని బయటకు లాగారు. లాఠీలతో కొట్టారు అంటూ గతాన్ని గుర్తు చేశారు. ఇక చంద్రబాబు ప్రసంగాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ ఘాటైన పదాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు సైకో అంటూ మండిపడుతూ, విపక్షంతో సై అంటే సై అనే సంకేతాలిస్తున్నారని అంటున్నారు.
ఆ హక్కు ఉందా?
మహిళల గురించి, నా భార్య గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. గత ఐదేళ్లలో మహిళలను వాళ్లకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. “నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి విధ్వంసం సృష్టించారు...అధికారం పోయాక బెదిరిస్తున్నారు. రాజకీయ పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగలరా..? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జగన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పారిపోతాడు. ఇలాంటి నేతలు మనకు అవసరమా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
చట్ట ప్రకారమే చేస్తా
50 మందిని పోగేసుకొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. కానీ నేను చట్ట ప్రకారమే వెళతాను. ఏ తప్పు చేయని నన్ను నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టాడు. ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తే ఎవరికీ రక్షణ ఉండదు. భవిష్యత్ ఉండదు. మనందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మర్చిపోవాలి. ఏమారితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.”అని సీఎం చంద్రబాబు అన్నారు.