ఆ బటన్ పై క్లిక్ చేశారా.. జీవిత కాలం సంపాదన మాయం.. తస్మాత్ జాగ్రత్త..
పుణెలో 75 ఏళ్ల వైద్యుడికి జరిగిన ఈ ఘోరం, సామాన్యులందరికీ ఒక కళ్ళు తెరిపించే పాఠం.;
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చదువుకున్న వారు.., సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న వారు ఇలాంటి మాయా మాటలకు చిక్కి కోట్లు నష్టపోవడం ఆందోళనకరమైన విషయం. పుణెలో 75 ఏళ్ల వైద్యుడికి జరిగిన ఈ ఘోరం, సామాన్యులందరికీ ఒక కళ్ళు తెరిపించే పాఠం.
రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం!
ఒక్క క్లిక్ తో జీవిత కాలపు సంపాదన గాలిలో కలిసిపోయింది! స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చనే భ్రమలను కల్పించి, సైబర్ మాయగాళ్లు అమాయకులను నిలువునా ముంచుతున్నారు. పుణెకు చెందిన ఒక సీనియర్ వైద్యుడు కూడా ఇదే తరహాలో రూ. 12.31 కోట్లు పోగొట్టుకున్నారు. కేవలం వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన ఈ ‘డిజిటల్ దోపిడీ’ ఎలా సాగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇవే.
వాట్సప్ గ్రూపుతో మొదలైన వేట
జనవరి చివరి వారంలో ఆ వైద్యుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో కొన్ని స్టాక్ రికమెండేషన్లు ఇచ్చి, ఒక లింక్ పంపారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆయనను ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అక్కడ ఒక అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీకి చెందినదిగా నమ్మించేలా ఉన్న ఒక మోసపూరిత యాప్‌ను డౌన్ లోడ్ చేయించారు. ఆ యాప్‌లో వచ్చే లాభాలను చూపిస్తూ ఆయనను నమ్మకంలోకి తీసుకున్నారు.
ఎనిమిది విడతలుగా రూ. 12 కోట్లు దోపిడీ..
నేరగాళ్ల మాయాజాలంలో చిక్కుకున్న వైద్యుడు, మార్చి 7 నుంచి 18వ తేదీ మధ్య కాలంలో మొత్తం ఎనిమిది విడతలుగా రూ.12.31 కోట్లను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. యాప్‌లో ఆయన పెట్టిన పెట్టుబడి రెట్టింపు అయినట్లు, భారీగా లాభాలు వచ్చినట్లు నకిలీ అంకెలను చూపించి భ్రమల్లో ఉంచారు. ఇది చూసి నిజంగానే డబ్బులు పెరుగుతున్నాయని భావించిన వైద్యుడు, తన వద్ద ఉన్న సొమ్మును పెట్టుబడిగా పెట్టారు.
బెదిరింపులు.. తీరా చూస్తే మోసం!
మరింత పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు ఒత్తిడి చేయడంతో వైద్యుడు సంకోచించారు. అప్పటికే పెట్టిన డబ్బులను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించగా.., వారు అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ‘మీరు డబ్బులు విత్ డ్రా చేయలేరు, ఇంకా ఇన్వెస్ట్ చేయకపోతే మీ ఖాతాలోని నగదును సీజ్ చేస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. దాంతో అనుమానం వచ్చిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించగా.., అది ఒక పెద్ద సైబర్ స్కామ్ అని తేలింది.
ఎలా జాగ్రత్త పడాలి?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇలాంటి ‘ట్రేడింగ్ స్కామ్స్’ విపరీతంగా పెరిగిపోయాయి. సెబీ గుర్తింపు లేని ఏ యాప్‌లోనూ పెట్టుబడులు పెట్టకూడదు. ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల ద్వారా వచ్చే టిప్స్, అధిక లాభాల ఆశ చూపే లింకులను అస్సలు నమ్మద్దు. ఒక్కసారి మన డబ్బు వారి ఖాతాలోకి వెళ్లిందంటే, దానిని వెనక్కి తీసుకురావడం కష్టంతో కూడుకున్న పని.
అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనే మనిషి ఆశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మలచుకుంటున్నారు. ఎంతటి విద్యావంతులైనా సరే, ఆర్థిక లావాదేవీల విషయంలో అనుమానం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు (1930 నంబర్‌కు) ఫిర్యాదు చేయాలి. పుణె వైద్యుడికి జరిగిన ఈ అనుభవం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. కష్టపడి సంపాదించిన సొమ్మును మాయగాళ్లకు అప్పనంగా అప్పగించకుండా ఉండాలంటే, డిజిటల్ ప్రపంచంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.