14 ఏళ్ల కిందటి స్కెచ్.. ఇప్పుడు ఫలించింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్త కాదు కానీ, పన్నెండేళ్ల క్రితం వేసిన స్కెచ్ ఇప్పుడు ఫలించడం విశేషం.;
రాజకీయాల్లో ఏ వ్యూహం ఎప్పుడు పారుతుందో.. ఏ స్కెచ్ ఎప్పుడు ఫలిస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రత్యర్థి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పంతం పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు కార్యరూపం దాల్చడం చూస్తుంటే రాజకీయ చదరంగం ఎంత చిత్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలని కేసీఆర్ వేసిన ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు ‘జగిత్యాల టైగర్’ జీవన్ రెడ్డి రూపంలో సక్సెస్ అయింది. అప్పట్లో తృటిలో తప్పిన ఈ ఫిరాయింపు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాల పుణ్యమా అని సాధ్యపడింది.
2014 నాటి స్కెచ్..
రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్త కాదు కానీ, పన్నెండేళ్ల క్రితం వేసిన స్కెచ్ ఇప్పుడు ఫలించడం విశేషం. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) కలిపేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే జీవన్ రెడ్డికి గులాబీ గూటి నుంచి ఆహ్వానం అందింది. అయితే ఈ విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో జీవన్ రెడ్డి స్వయంగా బయటపెట్టారు. అటు కేటీఆర్ కూడా ’ఆయన 2014లోనే మా పార్టీలోకి రావాల్సింది, అది ఇప్పటికి కుదిరింది’ అని వ్యాఖ్యానించడం ద్వారా నాటి స్కెచ్‌ను పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయ్యింది.
జగిత్యాల పంచాయతీ
జీవన్ రెడ్డి మనస్థాపానికి ప్రధాన కారణం తన రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడమే. రెండు ఎన్నికల్లో తనను ఓడించిన వ్యక్తిని రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోవడం, మెజారిటీ కౌన్సిలర్లు సంజయ్ వర్గం వైపు ఉండడంతో జీవన్ రెడ్డికి సొంత గడ్డపైనే భంగపాటు జరిగింది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.
రేవంత్ ను ఓడించడమే లక్ష్యం!
ఎంతో కాలం నిరీక్షించిన జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. ముఖ్యమంత్రిని గద్దె దించడమే లక్ష్యమని చెబుతూ బీఆర్ఎస్ లో కలిసిపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అన్నట్లుగా జగిత్యాల రాజకీయం సాగేది, కానీ ఇప్పుడు అదే పార్టీని ఓడించడానికి ఆయన కేంకార్ వేస్తున్నారు. అయితే, ఫిరాయింపులను వ్యతిరేకించే బీఆర్ఎస్, ఇప్పుడు ఒక కాంగ్రెస్ సీనియర్ నేతను చేర్చుకుంటూ పాత స్కెచ్‌లను గొప్పగా చెప్పుకోవడం రాజకీయ విడ్డూరమనే చెప్పాలి.
సొంత తప్పిదాలను బయటపెట్టారా..?
ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న ఫిరాయింపులు అనైతికం అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూనే 2014లో జరిగిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పాత అనైతిక రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. ‘అప్పుడే ఆయన రావాల్సింది’ అని అనడం ద్వారా, నాడు తాము కూడా కాంగ్రెస్‌ను ఖాళీ చేసే కుట్రలు చేశామని కేటీఆర్ అంగీకరించినట్లయ్యింది. ప్రత్యర్థిపై విమర్శలు చేసే క్రమంలో తమ పాత వ్యూహాలే ఇప్పుడు తమకు అస్త్రాలుగా మారడం విశేషం.
పుష్కరం కిందట కేసీఆర్ వేసిన విత్తనం ఇప్పుడు చెట్టయ్యింది. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల రీజియన్‌లో బీఆర్ఎస్ కు కొత్త బలం చేకూరవచ్చు కానీ, ఇది సిద్ధాంతాల పరంగా ఆ పార్టీకి ఒక పరీక్షే. ఫిరాయింపుల రాజకీయాలను ఇరు పక్షాలు తప్పుబడుతున్నా, చివరికి అవే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. 2014లో కేసీఆర్ వేసిన స్కెచ్ ఇన్నాళ్లకు వర్కవుట్ అయింది సరే.. మరి దీనివల్ల జీవన్ రెడ్డికి, బీఆర్ఎస్ కు కలిగే అసలు ప్రయోజనం ఏంటో రాబోయే కాలమే తేల్చాలి.