ఎవరీ ముకుల్ చౌదరి? కేకేఆర్ పై 7 సిక్సర్లతో విజయాన్ని అందించిన ఈ లక్నో ఆటగాడి బ్యాక్ గ్రౌండ్ ఇదీ

లక్నో సూపర్ జెయింట్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది.;

Update: 2026-04-10 06:30 GMT

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ధ్రువతార ఆవిర్భవించింది. అసాధ్యమనుకున్న మ్యాచ్‌ను సుసాధ్యం చేస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నోటి కాడ ముద్దను లాగేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు.

అసాధ్యమైన పోరాటం.. అద్భుత విజయం

లక్నో సూపర్ జెయింట్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి, గెలవాలంటే 24 బంతుల్లో 54 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్నది అంతగా అనుభవం లేని యువ ఆటగాడు ముకుల్ చౌదరి. కేకేఆర్ విజయం దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో అసలు సినిమా మొదలైంది.

సిక్సర్ల సునామీ.. బౌలర్ల బేజారు

ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో కేవలం 2 ఫోర్లు ఉంటే ఏకంగా 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. 17వ ఓవర్ లో వైభవ్ అరోరా వేసిన బంతులకు రెండు భారీ సిక్సర్లతో ముకుల్ తన ఉద్దేశాన్ని చాటాడు. 18వ ఓవర్ లో కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో మరో రెండు క్లీన్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 19వ కీలకమైన ఈ ఓవర్లో కెమెరాన్ గ్రీన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సమీకరణాన్ని లక్నోకు అనుకూలంగా మార్చేశాడు. ఆఖరి ఓవర్ లో మళ్ళీ వైభవ్ అరోరాపై రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాది, హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా 3 వికెట్ల తేడాతో లక్నోకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

ఎవరీ ముకుల్ చౌదరి? ఆయన నేపథ్యం ఏంటి?

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన ముకుల్ చౌదరి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తండ్రి దలీప్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. విశేషమేమిటంటే ముకుల్ పుట్టకముందే తన కొడుకును గొప్ప క్రికెటర్‌ను చేయాలని దలీప్ కలలు కన్నారు. తండ్రి ఆశయానికి తగ్గట్టే ముకుల్ చిన్నతనం నుంచే క్రికెట్ బ్యాట్ పట్టాడు. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన ముకుల్ ఆ తర్వాత తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని గుర్తించి వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారాడు. సరైన వసతులు లేని మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఢిల్లీ , గురుగ్రామ్ వంటి నగరాల్లో క్లబ్ క్రికెట్ ఆడుతూ తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు.

దేశీయ క్రికెట్‌లో మెరుపులు

ముకుల్ చౌదరి ప్రతిభ వెలుగులోకి రావడానికి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ప్రధాన కారణం. ఆ టోర్నీలో ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 173 పరుగులు చేసిన ముకుల్ ఏకంగా 198.85 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లే ఐపీఎల్ 2026 వేలంలో అతనికి భారీ డిమాండ్ తెచ్చిపెట్టాయి. తీవ్రమైన పోటీ మధ్య లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ₹2.6 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. తాజా ప్రదర్శనతో ఆ ధరకు తాను వంద శాతం అర్హుడనని ముకుల్ నిరూపించుకున్నాడు.

"ఒత్తిడే నాకు అవకాశం"

తన విజయంపై ముకుల్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. "నేను పుట్టకముందే నాన్న నన్ను క్రికెటర్ గా చూడాలనుకున్నారు. ఆయన కల నా బలం. మైదానంలో ఒత్తిడి ఉన్నప్పుడు నేను భయపడను. ఎందుకంటే ఆ ఒత్తిడే నా పేరును ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశంగా భావిస్తాను" అని ముకుల్ పేర్కొన్నాడు.

భారత క్రికెట్ జట్టుకు ఫినిషర్ల కొరత ఉందన్న తరుణంలో ముకుల్ చౌదరి లాంటి పవర్ హిట్టర్ రాక అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రింకూ సింగ్ తరహాలో అసాధ్యమైన మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఈ రాజస్థాన్ కుర్రాడిలో ఉందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఐపీఎల్ వేదికగా మరో సంచలన స్టార్ పుట్టుకొచ్చాడనడంలో సందేహం లేదు!

Tags:    

Similar News