విధేయులకు చిన్నమ్మ తాజా ఆదేశమిదే..

Update: 2017-02-22 13:25 GMT
చేతిలో అంతులేని పవర్ ఉన్నా.. అనుభవించలేని చిత్రమైన పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శశికళ పరిస్థితి ఇలాంటిదే. అక్రమాస్తు కేసులో దోషిగా నిరూపితం కావటంతో జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమె.. దూరదృష్టితో వ్యవహరిస్తున్నట్లుగా చెప్పాలి.

తానేం కోరుకున్నట్లే.. సీఎం కుర్చీలో తన విధేయుడు కూర్చున్న వేళ.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తనను చూడటానికి వస్తానంటే చినమ్మ నో అంటే నో అని చెప్పేస్తుందట. చిన్నమ్మ దయతో సీఎం.. మంత్రి పదవులు పొందిన నేతలంతా తమ అధినేత్రిని ఒక్కసారి కలిసి.. ఆమె ఆశీస్సులు తీసుకోవాలని తెగ ఆశ పడుతున్నారట. ఇందుకోసం ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశారు. లేఖలు రాసి.. చిన్నమ్మ పర్మిషన్ ఇస్తే జైలుకు వస్తామని కోరుతున్నా.. ఆమె మాత్రం అనుమతి ఇవ్వటం లేదని చెబుతున్నారు.

తనను ఎవరూ కలవటానికి జైలుకు రావొద్దని తేల్చి చెబుతున్న చిన్నమ్మ.. చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అమ్మ అప్పజెప్పిన పనుల్ని సమర్థవంతంగా నిర్వహించాలని.. పాలనలో అమ్మ మార్క్ కనిపించేలా చేయటానికి కృషి చేయాలని చెబుతున్నారట.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీఎం.. మంత్రులు తనను కలవటానికి జైలుకు వచ్చేందుకు తహతహలాడుతుంటే పర్మిషన్ ఇవ్వని చిన్నమ్మ.. తన అక్క కొడుకు దినకర్ ను జైల్లో కలవటమే కాదు.. తన దగ్గరకు ఎవరినీ రావొద్దని చెప్పాలని చెప్పారట. ఇంట్లో వారిని తప్పించి.. విధేయుల్ని జైలు ఛాయలకు రావొద్దని చెప్పటం ద్వారా చిన్నమ్మ ఏం కోరుకుంటోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? ఏమైనా జైలు వద్ద విధేయులు బారులు తీరే దృశ్యం కనిపించకుండా చేయటం ద్వారా చిన్నమ్మ ముందుచూపుతో వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News