సానియా మీర్జా భావోద్వేగం.. కెరీర్ చివరి గ్రాండ్ స్లామ్ ముగింపు..!

Update: 2023-01-27 12:29 GMT
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ఓటమితో ముగించింది. కెరీర్ లో చివరి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సానియా మీర్జా మహిళల డబుల్స్ లో నిరాశ పరిచింది. అయితే మిక్స్ డ్ డబుల్స్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది.

మిక్స్ డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసి సానియా మీర్జా టైటిల్ పోరులో తలపడింది. ఈ విభాగంలో తొలి నుంచి గట్టి పోటీ ఇస్తున్న సానియా మీర్జా.. రోహన్ జోడీ తుదిపోరులో మాత్రం ఓటమిపాలైంది. బ్రెజిల్ జంట స్టెఫాని-రఫెల్ తో తలపడిన సానియా-బోపన్న 6-7.. 2-6 తేడాతో ఓటమిపాలైంది. దీంతో సానియా మీర్జా తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీని ఓటమితో ముగించినట్లయింది.

36 ఏళ్ళ సానియా మీర్జా తన రిటైర్మెంట్ ను ఇప్పటికే ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్.. దుబాయ్ ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలోని మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్ వరకు చేరిన సానియా టైటిల్ ను మాత్రం అందుకోలేకపోయింది. రన్నర్ రప్ గా నిలిచి తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీని ముగించింది. మరోవైపు వచ్చే నెలలో జరిగే దుబాయ్ ఓపెన్ లో సానియా తన చివరి మ్యాచ్ ఆడనుంది.

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో ఫైనల్ చేరిన సానియా పరాజయం పాలైన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ మ్యాచ్ అనంతరం సినాయా మాట్లాడుతూ తన ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లో మొదలైందని తెలిపింది.

తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగించడానికి ఇంత కంటే మంచి వేదిక ఉంటుందని తాను అనుకోలేదని వెల్లడించింది. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని.. తన కుమారుడు చూస్తుండగా గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడుతానని తాను ఊహించలేదని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయింది.

సానియా మీర్జా భారత్ తరుపున ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆడి సత్తా చాటింది. టెన్నిస్ లో ఇప్పటి వరకు సానియా మీర్జా 43 డబుల్స్ టైటిల్ సాధించింది. వీటిలో ఆరు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. మహిళల డబుల్స్ కేటగిరిలో 91 వారాలపాటు సానియా మీర్జా నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగి రికార్డు సృష్టించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
4



Similar News