రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ ఫ్లైట్ .. ఎంత వేగంతో ఎగురుతాయంటే

Update: 2021-09-19 00:30 GMT
రోల్స్ రాయిస్..ఈ పేరు వినగానే పడవల్లాంటి విశాలమైన, విలాసవంతమైన కార్లు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కోట్ల రూపాయల విలువ చేసే కార్లను తయారు చేసే కంపెనీ అది. యునైటెడ్ కింగ్‌ డమ్‌ కు చెందిన టాప్ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేసిన రోల్స్ రాయిస్ కార్లను కొనాలనే ఆలోచన కూడా చేయరు సాధారణ వాహనదారులు. అలాంటి రోల్స్ రాయిస్ కంపెనీ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ రానున్నాయి. తేలికపాటి విమానాలను తయారు చేస్తోందా కంపెనీ. తొలుత సింగిల్ సీటర్ విమానాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. అనంతరం- ఈ సెక్టార్‌ను మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు. ఈ తేలికపాటి విమానాల ప్రత్యేకత ఏమిటంటే, పూర్తిగా ఎలక్ట్రికల్ ఫ్లైట్ అది. విద్యుత్ ఆధారంగా ఎగిరే విమానం.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే, రోల్స్ రాయిస్ పూర్తిగా విద్యుత్ ఆధారంగా ఎగిరే తేలికపాటి విమానాన్ని తయారు చేసింది. ఈ ఫ్లైట్ టెస్టింగ్‌ ను విజయవంతం చేసింది. జెట్ ఫ్లయిట్లకు అవసరమైన ఇంజిన్లను తయారు చేస్తుంటుంది రోల్స్ రాయిస్. కొత్తగా సొంతంగా తేలికపాటి జెట్ ఫ్లైట్‌ ను తయారు చేసింది. ది స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్‌ గా అది గుర్తింపు పొందింది. ఈ విమానం 15 నిమిషాల పాటు గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ తీసుకున్న తరువాత గరిష్ఠ వేగాన్ని అందుకుందా విమానం. గంటకు 300 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అంతే సేఫ్‌ గా ల్యాండ్ అయింది. ఈ టెస్టింగ్ విజయవంతమైనట్లు రోల్స్ రాయిస్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కోసం 6,000 సెల్స్ ఉన్న బ్యాటరీని వినియోగించినట్లు తెలిపింది. ఈ ఫ్లైట్‌కు మూడు ఇంజిన్లను అమర్చినట్లు పేర్కొంది. టేకాఫ్ తీసుకునే సమయంలో 400 కిలోవాట్ల విద్యుత్‌ను తీసుకుందని వెల్లడించింది. దీని వేల్యూ 500 హార్స్ పవర్లకు పైగా ఉంటుందని స్పష్టం చేసింది. ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తామని రోల్స్ రాయిస్ మేనేజ్‌మెంట్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. టెక్నాం కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ కింద ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తామని ఇదివరకు వెల్లడించింది. ఇందులో భాగంగా, ఈ విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ ఫ్లైట్‌ను తయారు చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఏవియేషన్ సెక్టార్‌ లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను వినియోగించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు చాలాకాలం నుంచీ వినిపిస్తూ వస్తోన్నాయి. విమానాల్లో ఇంధన వినియోగాన్ని భారీగా తగ్గించగలిగితే, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో విజయం సాధించినట్టవుతుందని అంటున్నారు.

విద్యుత్ ఆధారిత ఫ్లయిట్ల తయారీలో బరువు కీలక పాత్ర పోషిస్తుంది. కార్లతో పోల్చుకుంటే- తేలికపాటి విమానాల బరువు అధికంగా ఉంటుంది. అందుకే, దీన్ని మరింత తేలికగా మార్చాలని రోల్స్ రాయిస్ భావిస్తోంది. కాగా, విద్యుత్ ఆధారిత తేలికపాటి విమానాల తయారీ కోసం బ్రిటన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహయాన్ని అందజేస్తోంది. ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్‌ స్టిట్యూట్ ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడం, సరికొత్త రికార్డును సృష్టించిందని రోల్స్ రాయిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వారెన్ ఈస్ట్ తెలిపారు.



Tags:    

Similar News