చంద్రబాబు దిగిపోయి బాలకృష్ణకు పగ్గాలు?

Update: 2017-05-28 06:08 GMT
ఏపీలో పాలక టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మళ్లీ ఎన్నుకోనున్న నేపథ్యంలో విపక్ష ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆ పదవికి తగరని... ఆయన తక్షణం దిగిపోయి జాతీయ అధ్యక్ష పదవి ఆయన బావమరిది, వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇవ్వాలని అంటున్నారు.  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు.
    
దేశంలోనే అవినీతి సీఎంగా చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు.  టీడీపీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబును రాజీనామా చేయించి, ఆ పదవిని బాలయ్యకు ఇస్తే, పార్టీకి మేలు చేకూరుతుందని జోస్యం చెప్పారు. గత మహానాడులో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, కాపు సోదరుల రిజర్వేషన్ అంశంలో ఆయన నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
    
మరోవైపు ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చచ్చిపోయిందని, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ఉన్నా లేనట్టేనని  వ్యాఖ్యానించారు.  పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ బతికున్నంతకాలం, ప్రతి మహానాడులో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.  చంద్రబాబు పాలనలో ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News