స‌స్పెన్ష‌న్‌ పై డోంట్ కేర్ అంటున్న రోజా

Update: 2016-09-05 10:09 GMT
రెండ్రోజుల్లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో  వైఎస్సార్‌ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌ కే రోజా స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన‌ కాల్‌ మ‌నీ కేసులో సీఎం చంద్ర‌బాబుపై రోజా చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అనూహ్యంగా ఏడాదిపాటు స‌స్పెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ శాస‌న‌స‌భా స‌మావేశాలు - త‌న స‌స్పెన్ష‌న్‌ పై రోజా స్పందించారు. ప్రజల సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారంటే అందులో నాకెటువంటి బాధలేదన్నారు. చ‌ట్ట స‌భ‌ల వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు - ఆయ‌న పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును అంతా గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు కరువుతో తల్లడిల్లుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విహారయత్రలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని రోజా ప్ర‌శ్నించారు. చంద్రబాబు - కరువు కవల పిల్లలని - ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు కోరలు చాస్తోందని ఎద్దేవా చేశారు. వరుసగా  మూడో సంవత్సరం కరువు వచ్చినా, పరిహార సాయం అందించటానికి  చంద్రబాబుకు మనసు రాకపోవటం బాధాకరమని రోజా ఆవేదన వ్య‌క్తం చేశారు. పంటలు ఎండిపోయిన తర్వాత రెయిన్‌ గన్ల పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తూ, దొంగ లెక్కలు చెప్పి రైతులను మోసం చేస్తోందని మండిప‌డ్డారు. పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్లొస్తాయని చంద్రబాబు జనానికి అరచేతిలో వైకుంఠం చూపించారని రోజా గుర్తు చేశారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు హంద్రీనివా.. గాలేరుకు పెట్టి ఉంటే రాయలసీమ సస్యశ్యామలంగా ఉండేదని రోజా పేర్కొన్నారు.

పట్టిసీమ పేరుతో అంచనాలు పెంచుకంటూ రూ.వేలకోట్లు దోచేస్తున్నారని రోజా ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో ఇప్పటి వరకు రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదన్నారు. పట్టిసీమకు పెట్టిన డబ్బు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఖర్చు చేసి ఉంటే రాయలసీమ సస్యశ్యామలం అయి ఉండేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం పట్టిసీమ పేరుతో వేలకోట్లు మింగేస్తున్నారని రోజా ఆరోపించారు.ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్సార్‌ సీపీ తొలి నుంచీ పోరాటం చేస్తోందనీ, దీనిపై త‌మ పార్టీ అధినేత‌ వైఎస్ జగన్  హైదరాబాద్‌ నుండి ఢిల్లీ వరకు వివిధ రూపాల్లో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు మాత్రం  ఓటుకు నోటు కేసులో ప్రత్యేక హోదాను పణంగా పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటానికి ప్రజలు మద్దతిచ్చి పోరాటంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News