బెంగాల్ గెలిస్తే ఎన్డీయేలో కొత్త లెక్కలు !
బీజేపీ హాట్ ఫేవరేట్ స్టేట్ గా పశ్చిమ బెంగాల్ ఉంది. ఆ పార్టీ 2021లో బెంగాల్ ని చేజిక్కించుకునేందుకు చేసిన భారీ ప్లాన్స్ అంతా చూశారు.;
బీజేపీ హాట్ ఫేవరేట్ స్టేట్ గా పశ్చిమ బెంగాల్ ఉంది. ఆ పార్టీ 2021లో బెంగాల్ ని చేజిక్కించుకునేందుకు చేసిన భారీ ప్లాన్స్ అంతా చూశారు. అయినా సరే ఓడి గెలిచింది. ఏకంగా 75 సీట్లకు తక్కువ కాకుండా దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆనాడు చేసిన కృషి ఇపుడు బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు ఏమిటి అన్నది సమీక్షించుకోవడమే కాకుండా కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది.
సర్ తో భారీ చెక్ :
ప్రత్యేక ఓట్ల సవరణ సర్ పేరు తో కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలలో చేపడుతున్న ప్రక్రియకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోంది. అఫ్ కోర్స్ ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయనుకోండి. అయితే దీని వల్ల నకిలీ ఓట్లు పోతాయని బీజేపీ అంటోంది. అదే సమయంలో ఆ ఓట్లతోనే విపక్షాలు గెలుస్తున్నాయని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో బీహార్ లో అయితే ఏకంగా 65 లక్షలకు పైగా ఓట్లను సర్ ప్రక్రియలో భాగంగా తొలగించారు. వీరంతా అక్రమ వలసదారులు చనిపోయిన వారు అని చెప్పుకొచ్చారు. ఇపుడు చూస్తే బెంగాల్ లో ఈ ప్రక్రియ దూకుడుగా సాగుతోంది. మమత సొంత నియోజకవర్గంలో కూడా ఏకంగా నలభై వేల ఓట్లు సర్ పేరుతో తొలగించారు అని అంటున్నారు. ఇది ఆ తృణమూల్ కాంగ్రెస్ కి భారీ దెబ్బగానే చూస్తున్నారు.
బీజేపీని పట్టుకోవడం కష్టమే :
ఇక చూస్తే కనుక 2026 మే నేలలో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఆరు నూరు అయినా గెలిచి తీరాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దాంతో బీజేపీ పట్టుదలగా పనిచేస్తోంది. అక్కడ కనుక బీజేపీ గెలిస్తే ఎన్ డీయేలో కూడా కొత్త లెక్కలు మొదలవుతాయని అంటున్నారు. ఇప్పటికే బీహార్ లో మరోసారి ఎన్డీయే గెలిచింది. నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా చేసినా మొత్తం పెత్తనం అంతా బీజేపీదే అన్నట్లుగా అక్కడ ఉంది. అదే సమయంలో జేడీయూకి చెందిన 12 మంది లోక్ సభ అలాగే రాజ్యసభ ఎంపీలు అంతా పూర్తిస్థాయిలో ఏకపక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటించడానికి సిద్ధం అయిపోయాయి.
ఊతకర్రలు ఉత్త కర్రలు :
ఇక కేంద్రంలో మూడవసారి ఎన్డీయే ఎలా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలిసిందే ఏపీలో టీడీపీ బీహార్ లో నితీష్ కుమార్ ల మద్దతు అతి ముఖ్యమైనదిగా ఉంది. ఈ ఇద్దరు నాయకులు లేకపోతే మోడీ హ్యాట్రిక్ ప్రధాని అన్నది మాత్రం కష్టమే అని చెప్పాల్సి ఉంది. ఇక 2026లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలిస్తే ఈ ఇద్దరు మిత్రుల ప్రాధాన్యత కంటే బీజేపీ సౌండ్ ఎన్డీయేలో ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. బీజేపీ అజేయంగా మారుతుందని చెబుతున్నారు. దాంతో మరిన్ని కొత్త నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి బీజేపీకి అవకాశాలు అధికం అవుతాయని చెబుతున్నారు. అదే విధంగా బీజేపీని ఇక మీదట ఎవరూ శాసించలేని స్థితిలోకి వెళ్తుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.