తెలంగాణలో టీడీపీ స్కోరు ఎంతో తెలుసా..? పసుపుదళం మెరుపులు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెరుపులు చర్చనీయాంశంగా మారాయి.;
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెరుపులు చర్చనీయాంశంగా మారాయి. తొలివిడత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 పంచాయతీలను పసుపు సైనికులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారని గతంలో వార్తలు రాగా, రెండు మూడు విడతల్లో మరో 20 స్థానాలను టీడీపీ గెలుచుకున్నట్లు ఓ నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్థానం ఏకగ్రీవంగా గెలుచుకోగా, మిగిలిన 19 స్థానాలను గట్టిపోటీతో గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని పంచాయతీల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు రికార్డు స్థాయి మెజార్టీ రావడంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణలో టీడీపీ ఉనికే లేదని ఇన్నాళ్లు భావించిన ప్రధాన పార్టీలు తాజా ఫలితాల తర్వాత తమ అభిప్రాయాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే టీడీపీ కేడర్ మద్దతు కోసం అధికార కాంగ్రెస్, విపక్షం బీఆర్ఎస్ పోటీపడినప్పుడే పసుపుదళంపై విస్తృత చర్చ జరగింది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సర్పంచ్ పదవులను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ పునాదులు ఇంకా బలంగానే ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం టీడీపీ గెలుచుకున్న స్థానాలు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై సరికొత్త ఆశలను చిగురించేలా చేస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి దాదాపు 12 వేల పంచాయతీల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకునే సంఖ్య కానప్పటికీ, ఆ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫలితాలు గొప్పగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ చరిత్ర ఒకప్పటి వైభోగంగానే చర్చించుకుంటున్న సమయంలో పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి సహకారం లేకుండానే కేడర్ పోరాడి పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయడమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థుల్లో కొందరు కొందరు వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఇలా గెలిచిన వారికి పార్టీ సభ్యత్వంలో ఉందని చెబుతూ, సభ్యత్వం కార్డు నెంబరుతో కూడిన ఓ జాబితాను తయారుచేసి వైరల్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో వెలనాటి సునీత అనే మహిళ నాయకురాలు ఏకంగా 1258 ఓట్లతో గెలుచుకోవడం ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గం గట్టు భూత్కురు పంచాయతీలో మల్కాపురం రాజేశ్వరి 900 ఓట్లతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఖమ్మం, నల్లొండ జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు 500 ఓట్లకు పై మెజార్టీతోనే సర్పంచులు అయ్యారు. వీరంతా పసుపు జెండాతోనే ఎన్నికల్లో పోటీ చేయడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలతోపాటు హైదరబాద్ నగరం చుట్టుపక్కల విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా రాజకీయం చేసేది. అయితే 2004లో ఓటమి తర్వాత తెలంగాణలో తెలుగుదేశం తిరిగి బలపడే పరిస్థితి లేకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ కూడా చేయలేదు. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు కూడా పూర్తిగా తగ్గించేశారు. అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ కేడర్ కనిపిస్తుంది. ఇక ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా తెలంగాణ నేతలు పెద్దగా కనిపించిన పరిస్థితులు లేవంటున్నారు. కానీ, గ్రామస్థాయిలో జరిగిన ఎన్నికల్లో కేడర్ బలంగా పోరాడి స్వతంత్రంగా గెలవడమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.