వెట్టింగ్...వెట్టింగ్...వీసా వెయిటింగ్...

సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ పుణ్యమా అని భారత్ హెచ్1బీ వీసాదారులకు ఎడతెగని సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు.;

Update: 2025-12-18 12:11 GMT

అన్నీ కష్టాలు సీతకే అన్నట్లు ...ఇపుడు అన్ని కష్టాలు హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకే అని కొత్త సామెత చెప్పాల్సి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు తన వినూత్న వికట విన్యాసాలతో వీసావహులను రాచిరంపాన పెడుతున్నాడు. రోజుకో కొత్త రూల్ కొరడా ఝళిపిస్తున్నాడు. ఇపుడు సోషల్ వెట్టింగ్ అనే కొత్త యాపారానికి తెరలేపాడు. హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి నామగోత్రాదులతోపాటు సోషల్ మీడియాలో సదరు వ్యక్తి అకౌంట్... కార్యకలాపాలను వీక్షించి సమీక్షించి సంతృప్తి చెందితేనే రైట్ రైట్ అంటారు. ఏమాత్రం తేడా వచ్చినా రైట్ అబౌట్ టర్న్ తప్పదు గాక తప్పదన్నమాట.

సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ పుణ్యమా అని భారత్ హెచ్1బీ వీసాదారులకు ఎడతెగని సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. నెల రెండు నెలలు కాదు ఏకంగా వచ్చే ఏడాది అక్టోబర్ దాకా ఎదురు చూడాల్సిందే. చాలామంది దరఖాస్తుదారుల వీసా అపాయివంట్మెంట్ 2026 అక్టోబర్ కు వాయిదా పడ్డాయి. డిసెంబర్...జనవరిలో జరగాల్సిన హెచ్1బీ...హెచ్4 వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది ఫిబ్రవరి...మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. ఇపుడు ఈ ప్రక్రియ మరింత ఆలస్యమై అక్టోబరు దాకా వెళ్ళినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించడం...స్క్రీనింగ్ వ్యవహారాల వల్లే ఈ ఆలస్యమని అమెరికా అధికారుల చెబుతున్నారు. అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారు, ఉద్యోగాలు సంపాయించిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

హెచ్1బీ వీసాపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపడం వల్లే ఈ కష్టాలు షురూ అయ్యాయి. మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ అన్న నినాదంతో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి విచిత్ర పోకడలు పోతున్నారు. ఒక హెచ్1బీ విషయంలోనే కాదు ఇష్టారీతిగా విదేశాలపై టారిఫ్ లు విధించడం...భారత్ లాంటి వర్ధమాన దేశాలపై ప్రతీకార ఎగుమతి సుంకాలు విధించడం...భారత్ రష్యా సంబంధాలను తట్టుకోలేక పోవడం...బారత్ ను డెడ్ ఎకానమీ కంట్రీగా అవహేళన చేయడం...మన పొరుగు దాయాది దేశం పాకిస్తాన్ ను నియంత్రించినట్లు మనల్ని నియంత్రించడానికి ప్రయత్నంచడం ఇవన్నీ పెడబుద్దులుగానే పరిశీలకులు భావిస్తున్నారు. అసలు ప్రతీకార సుంకాలు...వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ మేధా వలసల్ని నియంత్రించడం లాంటి దుందుడుకు చర్యల వల్ల అమెరికాకే నష్టం ఎక్కువ అని ఆ దేశ మేధావులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు అరచి గీపెడుతున్నా మన ట్రంప్ వింటున్న దాఖలాల్లేవు. పైగా తాజాగా తనకు టారిఫ్ చాలా ఇష్టమైన పదం అని ప్రకటించారు. కేవలం ఇతర దేశాలపై టారిఫ్ లు విధించడం వల్లే అమెరికా ఆదాయం పెంచుకోవడం ఎంత నిర్హేతుక ఆలోచనో ట్రంపే నిర్ణయించాలి.

హెచ్1బీ వీసాలు కావాలంటే లక్ష డాలర్లు ఫీజుగా చెల్లించాల్సిందేనని గతంలో ట్రంప్ అనాలోచిత ప్రకటన చేసి వెంటనే వెనక్కు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. రినీవల్ కు కూడా ఇదే సూత్రం అమలవుతుందని అన్నా అదీ వెనక్కు తీసుకున్నారు. అలాగే ఈమధ్యన అమెరికా అధికారి ఒకరు ఒక హెచ్1బీ వీసా ఉద్యోగి....పదిమంది అక్రమవలసదారులతో సమానమని మాట్లాడ్డం అమెరికాలో అధికార వ్యవస్థ ఎంతలా దిగిపోయిందో చెప్పడానికి పనికి వస్తుంది. అమెరికా తలుపులు మూస్తే వారికే భారత్ తో వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు బెడిసి కొడతాయన్న విషయం అక్కడున్న చాలా మంది అమెరికన్ మేధావులకు తెలుసు. తాజాగా ఈ సోషల్ వెట్టింగ్ అనే ప్రహసనాన్ని తీసుకొచ్చి హెచ్1బీ వీసాల జారీ ఆలస్యం చేయడం ట్రంప్ సర్కార్ కే చెల్లింది.

Tags:    

Similar News