నెక్ట్స్ లెవల్ లో ఏపీ టూరిజం.. విశాఖలో వండర్‌లా, తిరుపతిలో ఇమాజికా వరల్డ్..

ఏపీలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వం చేసే భూ కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం టూరిజం ప్రాజెక్టులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.;

Update: 2025-12-18 12:55 GMT

ఏపీలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వం చేసే భూ కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం టూరిజం ప్రాజెక్టులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రపంచస్థాయి టూరిజం ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతున్నారు. ఈ దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రపంచ పర్యాటక రంగంలోని మంచి పేరున్న వండర్‌లా విశాఖలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా తిరుపతిలో ఇమాజికా వరల్డ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి టూరిజంపై ఎక్కువ దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే తరచూ పర్యాటక రంగంపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన థీమ్ పార్క్ చైన్‌లలో ఒకటైన వండర్‌లాకు విశాఖపట్నంలో 50 ఎకరాల భూమి కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రపంచ స్థాయి వినోద సదుపాయాలకు పేరుగాంచిన ఇమాజికా వరల్డ్ తిరుపతిలో 20 ఎకరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించిందని చెబుతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతాయని, గణనీయమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు కోరిన భూములను ఇప్పటికే వేరే సంస్థలకు కేటాయించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రెండు ప్రతిష్ఠాత్మక సంస్థల ఏర్పాటుపై సందిగ్ధం ఏర్పడగా, ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించి, ఆయా సంస్థలు కోరిన భూములను అప్పగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలలో టూరిజం శాఖ రూ.28,977 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడుతోందని ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రాజెక్టుల వల్ల టూరిజం మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఇక పర్యాటక రంగంలో ఎక్కువగా విశాఖ, తిరుపతిలోనే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలో రూ.11,092 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతిలో రూ.5,321 కోట్ల విలువైన 27 ప్రతిపాదనలతో రెండో స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. మూడోస్థానంలో రాజధాని అమరావతితో రూ.3,960 కోట్ల విలువైన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Tags:    

Similar News