నేనంటే భయం.. రాజకీయ ప్రవేశంపై శివాజీ హాట్ కామెంట్స్
మరికొందరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు శివాజీ ఒకరు.;
సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది సినీ నటులు తమకు వచ్చిన పేరు, ప్రఖ్యాతలను రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఉపయోగించుకున్నారు. కొందరు రాజకీయాల్లో ఉన్నత పదవులు కూడా అధిరోహించారు. మరికొందరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు శివాజీ ఒకరు.
గతంలో పలు రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలిచిన శివాజీ, ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదు. గత ఎన్నికల సమయంలో ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ‘దండోరా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శివాజీ, రాజకీయాల్లోకి వచ్చే అంశంపైన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు.
రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని శివాజీ తేల్చిచెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలంటే అందరి పట్ల నిర్ధాక్షిణ్యంగా ఉండాలి లేదా ఇతరుల కాళ్లు పట్టుకునే స్వభావం ఉండాలన్నారు. ఈ రెండూ తనకు చేతకావని.. అందుకే రాజకీయాల్లోకి రానని స్ఫష్టం చేశారు.
అయితే ఏ పార్టికి చెందినవాడిగా కాకపోయినా.. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించడాన్ని మాత్రం ఆపనని శివాజీ తెలిపారు. గతంలో తాను రాజకీయాల్లోకి వస్తానంటే రాజకీయ నాయకుల్లో భయం ఉండేదని.. మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతానో అన్న ఆందోళన వాళ్లలో ఉండేదని చెప్పారు. తప్పు జరిగితే తప్పు అని చెప్పే స్వభావం తనదని.. అర్థమయ్యే రూట్ లోనే తన అభిప్రాయాలను వ్యక్త పరిచేవాడిని అని అన్నారు. తాను అప్పట్లో చెప్పిన అనేక అంశాలు ఇప్పుడు అమలవుతున్నాయనడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే టాలెంట్ తో పాటు లక్, లౌక్యం అవసరమని శివాజీ అన్నారు. కానీ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే మనల్ని కంట్రోల్ చేసుకునే స్వభావం, అవసరమైతే కాళ్లు పట్టుకునే తత్త్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాంటి స్వభావాలు తనకు లేవని.. అందుకే రాజకీయాలు తనకు సరిపోవని చెప్పారు.
శివాజీ కెరీర్ విషయానికి వస్తే.. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శివాజీ ఆ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా మంచి ఫేజ్ లో ఉన్నారు.త్వరలోనే ‘దండోరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శివాజీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు.