రోజా తెలివే తెలివి;పవన్ ను సీన్లోకి తీసుకొచ్చారు

Update: 2015-10-12 05:16 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తెలివితేటలు ఎలా ఉంటాయో ఆమె మాటలు వింటేనే అర్థమవుతుంది. బలమైన వాదనను వినిపించటం.. సూటిగా విమర్శలు చేయటంతోపాటు.. మాటలతో మంటలు పుట్టించటం ఆమెకు చాలా తేలిక. తమ పార్టీ అదినేత చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలుపుతూ.. రెగ్యులర్ గా దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్న ఆమె.. సమయానికి తగ్గట్లుగా మాట్లాడుతుండటం గమనార్హం.

మొన్నటివరకూ దీక్ష చేస్తున్న జగన్ పోరాటాన్ని మెచ్చుకుంటూ.. ఏపీ అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె.. తాజాగా మాత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీన్లోకి తీసుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేటి దూకుడు రాజకీయాల్లో కనిపించని గౌరవం.. మర్యాద లాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. పవన్ ను ఉద్దేశించి రోజా ఆచితూచి మాట్లాడటం కనిపిస్తుంది.

ప్రత్యేక హోదా అంశంపై ఏపీలోని ప్రతి గుండె తపిస్తోందన్న ఆమె.. ప్రశ్నించటానికి వచ్చానని చెప్పే పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా మీద ఎందుకు ప్రశ్నించటం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతిలో జరిగిన సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ.. చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చూస్తూ.. ‘‘పవన్ కల్యాణ్ గారు ఆ మాటలకు మీరే సాక్షి’’ అని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించటం లేదన్న పవన్ కల్యాణ్ ను.. మరికొన్ని అంశాల మీద కూడా ప్రశ్నించాలంటూ రోజా సూచించారు. మంత్రి నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని.. ఇలాంటి విషయాల్ని ప్రశ్నించాలని.. ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపాలంటూ పవన్ ను కోరారు.

అయినా.. మహనేత కుమారుడు.. రాష్ట్రానికి రాబోయే రోజుల్లోకాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకునే వ్యక్తి ఒక అంశం మీద దీక్ష చేస్తుంటే.. పవన్ లాంటి ఒక సామాన్య నేత దీక్ష వద్దకు వచ్చి మరీ మద్ధతు తెలపాలా? సంఘీభావం కూడా జగన్ అండ్ కో చెప్పినట్లే చేయాలా? పవన్ ప్రశ్నించాలనటంలో తప్పు లేదు కానీ.. సంఘీభావం తెలపాలని డిమాండ్ చేయటం ఏమిటో రోజాకే తెలియాలి. పవన్ ను ప్రశ్నిస్తున్నానని అనుకునే క్రమంలో రోజమ్మ జగన్ ఈగోను ఇబ్బంది పెట్టటం లేదు కదా..?
Tags:    

Similar News