ఆగని పతనం.. ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి
భారతీయ రూపాయి విలువ ఆందోళనకరంగా పడిపోతోంది. గత కొన్ని రోజులుగా నిరంతరంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని చేరుకుంది;
భారతీయ రూపాయి విలువ ఆందోళనకరంగా పడిపోతోంది. గత కొన్ని రోజులుగా నిరంతరంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని చేరుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉండే ఈ పరిణామం ఆర్థికవర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ఆల్ టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి
తాజాగా పతనం ప్రకారం.. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90.75 స్థాయికి చేరుకుంది. ఇది ఇప్పటివరకూ రూపాయి నమోదుచేసిన అత్యంత కనిష్ట విలువ. కేవలం ఒక్కరోజులోనే రూపాయి ఏకంగా 26 పైసలు పతనం కావడం ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది.
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం రూపాయి విలువ క్షీణించడానికి పలు అంతర్జాతీయ, దేశీయ అంశాలు కారణమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూస్తే..భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఆలస్యం కావడం ప్రధాన కారణం. దీనిపై స్పష్టత లేకపోవడం మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్యలోటు పెరుగుతోంది. దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ అధికమై రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతుండడం.. సురక్షితమైన పెట్టుబడిగా డాలర్ కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి పతనానికి కారణం. అమెరికా విధించిన టారిఫ్ ల వల్ల భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లు విధించడం ఈ క్షీణతకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రూపాయి పతనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కీలకమైన ప్రభావాలు ఉంటున్నాయి. దిగుమతుల వ్యయం పెరుగుతోంది. చమురు , ఎలక్ట్రానిక్, ఫార్మా, ముడిసరుకుల వంటి దిగుమతుల ధరలు భారీగా పెరుగుతాయి. దిగుమతుల ధరలు పెరగడం వల్ల దేశీయంగా వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. విదేశీ కరెన్సీలో ఆదాయం పొదే ఎగుమతిదారులకు ఇది తాత్కాలికంగా లాభాన్ని చేకూర్చవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ పాత్ర ఏంటి?
ఈ కీలక సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)జోక్యంపై ఆర్థిక వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి.. మార్కెట్ లో డాలర్ల ప్రవాహాన్ని పెంచడానికి ఆర్ బీఐ తన విదేశీ మారకపు నిల్వలను ఉపయోగించే అవకవాశం ఉంది. అయితే ఇప్పటివరకూ ఆర్బీఐ పరిమిత స్థాయిలో మాత్రమే జోక్యం చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ స్వేచ్ఛకు వదిలేస్తుందా? లేక బలమైన జోక్యంతో నియంత్రిస్తుందా? అన్నది భవిష్యత్తులో చూడాలి.
ట్రేడ్ డీల్స్ లో స్పష్టత, వాణిజ్యలోటు నియంత్రణకు కఠిన చర్యలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగితేనే రూపాయి కొంత స్థిరపడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ తీసుకునే విధాన నిర్ణయాలే రాబోయే రోజుల్లో రూపాయి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.