ఆంధ్రా పవన్....అపుడే మొదలెట్టేశారు
ఇక తెలంగాణాలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలసి పనిచేయనున్నాయి. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.;
పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా ఈ రోజుకీ కొనసాగుతున్నారు. ఒక వైపు కీలక పదవిలో అధికారంలో ఉంటూనే మరో వైపు సినిమాలు చేస్తున్నారు. పైగా పన్నెండేళ్ల క్రితం వరకూ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగానే ఉన్నాయి. కానీ రాజకీయాలు మాత్రం విడదీసి చూస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పవన్ అంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నారు. కాబట్టి వారి రాజకీయ విమర్శలు అలా ఉన్నాయనుకున్నా జనసేన రెండు రాష్ట్రాలలో ఉంది కదా, ఆ విధంగా ఆలోచిస్తే పవన్ రెండు ప్రాంతాలకు చెందిన వారు ఎందుకు కారు అన్న చర్చ సాగుతోంది. అయితే ఈసారి విశేషం ఏంటి అంటే ఆంధ్రా పవన్ అంటూ హాట్ కామెంట్స్ చేస్తోంది బీఆర్ఎస్ కాదు, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్. ఇంతకీ ఎందుకు పవన్ మీద ఈ తరహా కామెంట్స్ చేయాల్సి వచ్చింది అంటే అక్కడే ఉంది అసలైన మ్యాజిక్.
మునిసిపల్ పోరులో :
ఇదిలా ఉంటే తెలంగాణాలో జరిగే మునిసిపల్ ఎన్నికల పోరులోకి తొలిసారి జనసేన దిగుతోంది. ఆ పార్టీ పెట్టాక 2023లో తొలిసారి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. అంతకు ముందు చూస్తే జీ హెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే ఈసారి బీజేపీ జనసేనతో పొత్తు లేదని స్పష్టంగా చెప్పింది. అయినా సరే బీజేపీ ఎన్నికల ప్రచారానికి మాత్రం జనసేనానిని ఆహ్వానించడం మరో విశేషం. ఇక రెండు పార్టీలు మునిసిపల్ ఎన్నికల పోరులో ఉన్నాయి. వీటిని స్నేహపూర్వకమైన పోటీగా చెబుతున్నాయి.
పవన్ ప్రచారంతో :
ఇక తెలంగాణాలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలసి పనిచేయనున్నాయి. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7, 8 తేదీలలో పవన్ కళ్యాణ్ తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఈ రెండు పార్టీ అభ్యర్ధుల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే పవన్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే తెలంగాణా రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు భేటీ అయి చర్చించిన మీదట బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ప్రకటించింది. ఇక తెలంగాణా బీజేపీ కూడా పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారు అన్నది ధృవీకరించింది.
ఏపీ నుంచి విస్తరణ :
మరో వైపు చూస్తే ఏపీలో జనసేన బీజేపీల మధ్య మంచి దోస్తీ కొనసాగుతోంది. అది తెలంగాణాకు కూడా విస్తరిస్తోంది. దాంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహ బంధం ఇక్కడ కూడా రానున్న రోజులలో బలోపేతం అవుతుందని అంటున్నారు. దీంతో పట్టణ ప్రాంతాలలో ఇప్పటికే బీజేపీకి బలం ఉంది. జనసేన మద్దతు, పవన్ ప్రజాకర్షణ శక్తితో మరిన్ని సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్ :
అయితే బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేయడాన్ని తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆంధ్రా పవన్ తో తెలంగాణ లో ప్రచారం చేయిస్తే జనాలు ఓటు వేయరని ఆయన అంటున్నారు. బీజేపీకి బలం లేకనే ఆంధ్రా నాయకుడితో ప్రచారం చేయించుకుంటోంది అని ఎద్దేవా చేశారు.దీంతో కాంగ్రెస్ పవన్ ని ఏపీ నేతగానే పరిమితం చేస్తోంది అని అంటున్నారు మరి ముందు ముందు బీఆర్ఎస్ కూడా ఇదే రకమైన విమర్శలు చేసే అవకాశాలు లేకపోలేదు, చంద్రబాబు విషయంలో బీఆర్ఎస్ ఇదే రకంగా వ్యవహరించింది మరి తెలంగాణా జనాలు ఈ రకమైన విమర్శలు పట్టించుకుంటారా పవన్ ప్రచారానికి జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. జనసేన బీజేపీ స్నేహ బంధం ఏ రకమైన ఫలితాలు మునిసిపల్ ఎన్నికల్లో ఇవ్వబోతోంది అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.