సైబర్ నేరగాళ్ల బారిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత... ట్విస్ట్ ఏమిటంటే..!

ఇటీవల కాలంలో భారతదేశంలో డిజిటల్ అరెస్టుల పేరున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-15 20:30 GMT

ఇటీవల కాలంలో భారతదేశంలో డిజిటల్ అరెస్టుల పేరున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చిన్నా, పెద్దా అనే తారతమ్యాలేవీ లేవు. ఫలితంగా గత రెండేళ్లలో ఇలాంటి స్కామ్ ల ద్వారా సుమారు రూ.2,500 కోట్లకు పైగా దోచుకున్నారని చెబుతున్న నివేదికలు ఈ నేరాల తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. ఈ క్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈ బాధితుల్లో ఒకరు కావడం గమనార్హం.

అవును... భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్ టి రామసామి సైతం డిజిటల్ అరెస్టు బాధితుల్లో ఒకరనే విషయం చర్చనీయాంశంగా మారింది. 77 ఏళ్ల ఈ చెన్నై నివాసి సైబర్ మోసాల కారణంగా రూ.57 లక్షలు పోగొట్టుకున్నారు. వారు సెప్టెంబర్ లో తన ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయమని బలవంతం చేసి, సక్సెస్ అయ్యారని చెబుతున్నారు!

తొలుత ఆయనకు ఢిల్లీ పోలీసు యూనిఫాంలో వీడియో కాల్ లో కనిపించిన మోసగాళ్లు.. నకిలీ ఎఫ్.ఐ.ఆర్. కాపీలు చూపిస్తూ తీవ్రంగా బెదిరించారట. ఈ విషయాన్ని రామస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని నమ్మబలికారని అంటున్నారు. ఈ క్రమంలోనే దశలవారీగా రూ.57 లక్షలు చెల్లించగా.. ఆ తర్వాత మరో రూ.2.43 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారని.. దీంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

దీంతో... గ్రేటర్ చెన్నై పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. కొత్త నెంబర్స్ నుంచి వచ్చే వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని.. అలా ఏ అధికారీ ఎలాంటి ఫోన్ కాల్ చేయరని చెబుతున్నారు.

ఎవరీ పద్మభూషణ్ రామసామి!:

శాస్త్రవేత్త నుంచి పౌర సేవకుడిగా మారిన రామసామి... భారత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పనిచేసిన కార్యదర్శులలో ఒకరు. ఇదే సమయంలో... చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీ.ఎల్.ఆర్.ఐ) డైరెక్టర్ గా, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీ.ఎస్.ఐ.ఆర్) డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఈ క్రమంలో.. అనేక సైన్స్ అవార్డులతోపాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.

ఇక్కడో ట్విస్ట్ కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రామసామికి లభించిన జీవితకాల పురస్కారం అందుకోవడానికి వెళ్లే సమయానికే ఆయన డిజిటల్ అరెస్టులో ఉన్నారంట. దీంతో ఆయన తిరుచ్చికి వెళ్లడానికి తనను ఆన్ లైన్ లో బంధించిన వారి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందంట.

‘డాట్’ నుంచి స్ట్రాంగ్ సూచనలు!:

మరోవైపు.. టెలీకమ్యునికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలీకమ్యునికేషన్స్ విభాగం (డాట్) పౌరులకు ఓ కీలక సూచన జారీ చేసింది! ఇందులో భాగంగా... కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు చేసి, తీరా మనం రిసీవ్ చేసుకున్న తర్వాత మాట్లాడకుండా సైలంట్ గా ఉంటే.. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలో ఒకటని తెలిపింది. అలాంటి నెంబర్లకు తిరిగి ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్ చేయవద్దని సూచించింది. అనంతరం.. సంచార్ సాథీ యాప్ లో రిపోర్ట్ చేయాలని పేర్కొంది.

Tags:    

Similar News