మహిళ పట్ల ఇదేమిపని ముఖ్యమంత్రి జీ... షాకింగ్ వీడియో!
బీహార్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్... తాజాగా ఊహించని రీతిలో అన్నట్లుగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.;
బీహార్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్... తాజాగా ఊహించని రీతిలో అన్నట్లుగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇందులో భాగంగా... పాట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్ ను ప్రధానం చేస్తూ, ఆమె హిజాబ్ ను లాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును... సోమవారం పాట్నాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలోని వీడియో ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తున్న సమయంలో సీఎం నితీశ్ కుమార్.. ఓ మహిళా ఆయుష్ వైద్యురాలి హిజాబ్ ను తొలగిస్తూ కనిపించారు. దీంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపింది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ లు సీఎంను ఘాటుగా విమర్శిస్తున్నాయి.
ఆ వీడియోలో.. నియామకులైన వారిలో ఒక మహిళ లెటర్ ను స్వీకరించడానికి ముందుకు వచ్చారు. ఆ సమయంలో.. అపాయింట్మెంట్ లెటర్ అందజేసిన అనంతరం, ముఖ్యమంత్రి ఆ మహిళ ముఖానికి ధరించిన హిజాబ్ వైపు సైగ చేసి, దాని గురించి అడుగుతున్నట్లు కనబడగా, అనంతరం స్వయంగా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు! దీంతో అక్కడున్నవారిలో కొంతమంది నవ్వుతూ కనిపించడంతో సదరు మహిళ కలత చెందినట్లు కనిపించింది.
ఈ సమయంలో ముఖ్యమంత్రి చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. నితీష్ కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో.. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ - జేడీయూ సంకీర్ణ ప్రభుత్వ వైఖరి ఏంటో ఈ విషయం తెలియజేస్తోందంటూ ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
"ఈ నిస్సిగ్గు చర్యను చూడండి.. ఒక మహిళా వైద్యురాలు తన నియామక లేఖను స్వీకరిచడానికి వచ్చినప్పుడు.. నితీశ్ కుమార్ ఆమె హిజాబ్ ను తీసివేశారు. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తే.. రాష్ట్రంలో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారో ఊహించవచ్చు. ఈ చర్యకు నితీశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.. ఈ రకమైన దుష్ప్రవర్తన క్షమించరానిది" అని కాంగ్రెస్ పేర్కొంది!
అదేవిధంగా... ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)... "నితీశ్ జీ కి ఏమైంది? ఆయన మానసిక స్థితి పూర్తిగా క్షీణించిందా.. లేక, నితీశ్ బాబు ఇప్పుడు 100% సంఘీగా మారిపోయారా?" అని ప్రశ్నించింది!