విగ్రహావిష్కరణల వేళ రాజకీయాల ప్రస్తావన తెచ్చిన ఎస్పీ బాలు కుమారుడు
తెలంగాణలోని హైదరాబాద్ లో ఎస్పీ బాలు విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.;
తెలంగాణలోని హైదరాబాద్ లో ఎస్పీ బాలు విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ మేరకు మూడు నాలుగు రోజులుగా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్విగ్నంగా జరిగింది. మొత్తానికి అయితే ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కృతమైంది. అయితే ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ అనంతరం ఆయన కుమారుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా.. అందరితో సమానంగా మెలిగేవారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ గుర్తు చేసుకున్నారు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వేదికైన తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, అలాగే గత నాలుగేళ్లుగా విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి ఎస్పీ చరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నాన్న అందరితో ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారన్న దానికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనం. ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. అద్భుతమైన మానవతావాది’ అని చరణ్ ఉద్ఘాటించారు. తన తండ్రి తమ మధ్య లేకపోయినా.. ఈ విధంగా ఆయనకు దక్కిన గౌరవం తమ కుటుంబానికి ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచంద్రరావు తదితర ప్రముఖులు హాజరై బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా నివాళులర్పించారు.
బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శాలువతో సత్కరించారు. ఎస్పీ బాలు విగ్రహం తెలుగు సంగీత ప్రియులకు ఆయన జ్ఞాపకాలను ఎల్లప్పుడూ గుర్తుచూస్తూ ఉంటుంది.
ఇక ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటును తెలంగాణ ఉద్యమకారులు నిరసించారు. తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా చెప్పుకుంటున్న సంగంరెడ్డి ఫృథ్వీరాజ్ ఈ సందర్భంగా బాలు విగ్రహా ఏర్పాటుపై మండిపడ్డారు. ఆంధ్రా వాళ్లను తీసుకొచ్చి తెలంగాణ గుండెలపై మోపుతున్నారు. ఆంధ్రా నేతలపేర్లు ఆ ప్రాంతంలో లేదు. తెలంగాణలో ఎందుకు పెడుతున్నారు. వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఏంటి.. పరాయి పాలనలో ఇంకా బానిసత్వపు పాలననేనా? అంటూ ఫృథ్వీరాజ్ మండిపడ్డారు. ‘విగ్రహాన్ని ఎన్నిరోజులు పోలీసులు కాపడతారో చూస్తాం.. దాన్ని తొలగిస్తాం’ అంటూ సవాల్ చేశారు. తెలంగాణ కళాకారులు, పెద్దమనుషులు, నేతలను పట్టించుకోకుండా.. ఆంద్రా వాళ్లను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం ఏంటని ఫృథ్వీరాజ్ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఎస్పీ చరణ్ రాజకీయాలకు అతీతం తన తండ్రి ఎస్పీ బాలు అంటూ సంచలన కామెంట్స్ చేసి ఈ రాజకీయ వైరాలపై తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.